బ్రిస్టల్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వికెట్ల వెనుక ఎంత చురుగ్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వికెట్ కీపర్లలో ధోనితో సరితూగ గలవారు ఎవరూ లేరనే దానికి అతను సాధిస్తున్న రికార్డులే అద్దం పడుతున్నాయి. అలాంటి ధోనిని బోల్తా కొట్టిస్తూ ఆఖరి బంతికి పరుగు తీయాలని ఆశించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జోర్డాన్‌కి నిరాశే ఎదురైంది. అతను క్రీజులోకి వచ్చేలోపే.. బెయిల్స్ అతనికి స్వాగతం పలికాయి. ఇప్పటికే టీ20ల్లో అత్యధిక స్టంపౌట్స్ చేసిన వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పిన ధోని.. ఈ మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు పట్టి ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు.
ఇంగ్లండ్‌తో ఆదివారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ని యువ ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ వేశాడు. ఆ ఓవర్‌లోని ఐదు బంతులు ముగిసేసరికి.. ఇంగ్లండ్ 198/8తో నిలిచింది. దీంతో.. చివరి బంతికి ఎలాగైనా ఒక పరుగు తీసి.. భారత్ ముందు 200 పరుగుల టార్గెట్‌ను ఉంచాలని క్రీజులో ఉన్న ఆదిల్ రషీద్, జోర్డాన్ నిర్ణయించుకున్నారు. దీంతో.. షార్ట్‌పిచ్ రూపంలో బంతిని విసరాల్సిందిగా.. సిద్ధార్థ్ కౌల్‌కి ధోని సూచించాడు. ఈ సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న జోర్డాన్.. ఒకవేళ బంతి బ్యాట్‌కి తగలకపోయినా.. పరుగు తీయాలని సైగల ద్వారా ఆదిల్ రషీద్‌కి తెలియజేశాడు. దీన్ని పసిగట్టిన ధోనీ.. ముందుగానే తన కుడిచేతి గ్లౌవ్‌ని తీసేసి రనౌట్‌కి సిద్ధమైపోయాడు. వ్యూహం ప్రకారం సిద్ధార్థ్ కౌల్ షార్ట్‌పిచ్ బంతిని విసరగా.. దాన్ని ఆదిల్ రషీద్ కనీసం టచ్ కూడా చేయలేకయాడు. అదే సమయంలో పరుగు కోసం జోర్డాన్ ప్రయత్నించగా.. అప్పటికే బంతిని అందుకున్న ధోని మెరుపు వేగంతో బంతిని వికెట్లపైకి విసిరి రనౌట్ చేశాడు. దాంతో ధోని బ్రెయిన్‌కు హ్యాట్సాఫ్ అంటూ క్రికెట్ ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment