వార్మప్ లో అదరగొట్టిన ధోని
లండన్: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చాంపియన్స్ ట్రోఫి సన్నాహకంగా జరిగిన వార్మప్ మ్యాచ్ లో అదరగొట్టాడు. ఇప్పటికే మైమరిపించే కీపింగ్, అద్భుత బ్యాటింగ్ తో ప్రశంసలు పోందిన ధోని.. వార్మప్ మ్యాచ్ లో రాణించి తనలోని సత్తా ఏమాత్రం తగ్గలేదని ప్రత్యర్థులకు సవాలు విసిరాడు. ఆదివారం న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో ధోని కీపింగ్, బ్యాటింగ్ తో అభిమానులను అలరించిన తీరు 'ప్రాక్టీస్' కు అందం తెచ్చింది.
సూపర్ స్టంపింగ్..
ధోని వికెట్ల వెనుక ఉంటే ఎంత విధ్వంసకర బ్యాట్స్ మన్ అయినా క్రీజు వదలాలంటే జంకుతారు. అంత ఖచ్చితత్వంతో కీపింగ్ చేస్తాడు ధోని. ఇక వార్మప్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 110 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో బ్యాటింగ్ కు వచ్చిన గ్రాండ్ హోమ్ 22 ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బంతులకు తడబడ్డాడు. ఇక పరుగులు రాబట్టాలనే ఉద్దేశ్యంతో క్రీజు వదిలి వెళ్లగా బంతిని అందుకున్న ధోని రెప్పపాటులో వికెట్లను గిరాటేశాడు. ఈ స్టంపింగ్ ను చూసిన ప్రతి ఒక్కరు అవాక్కయ్యారు.
సిక్స్ తో అలరించిన ధోని
ధోని కేరిర్ లో ఎన్నోగొప్ప సిక్స్ లు కొట్టాడు. యార్కర్ బంతులను హెలికాఫ్టర్ షాట్ తో సిక్సర్ గా మలచడం ధోనికే ప్రత్యేకం. కానీ వార్మప్ మ్యాచ్ లో ఓ వైవిధ్యమైన సిక్స్ ను కొట్టి అబ్బురపరిచాడు. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అజింక్యా రహనే, శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్ అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చాడు. 25 ఓవర్లో మూడో బంతి ట్రెంట్ బౌల్ట్ ఆఫ్ సైడ్ దూరంగా వేసిన బంతిని ధోని కవర్స్ మీదుగా సిక్స్ గా మలిచిన తీరు అదుర్స్ అనిపించింది. ఈ బంతి గ్రాండ్ హోమ్ చేతిలో నుంచి జారి బౌండరి రోప్ మీద పడటం విశేషం. భారత్ 129/3 స్కోరు వద్ద వర్షం అడ్డంకిగా మారడంతో భారత్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం 45 పరుగుల తేడాతో గెలుపొందింది. కోహ్లీ (52), ధోని(17) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. మంగళవారం భారత్ బంగ్లాదేశ్ తో ఇదే వేదికగా మరో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక ధోని ఆటపై ట్వీటర్ లో ప్రశంసల జల్లు కురుస్తుంది.