వీనస్‌ (Vs) ముగురుజా | Muguruza storms into second Wimbledon final | Sakshi
Sakshi News home page

వీనస్‌ (Vs) ముగురుజా

Published Fri, Jul 14 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

వీనస్‌ (Vs) ముగురుజా

వీనస్‌ (Vs) ముగురుజా

వింబుల్డన్‌లో మహిళల పోరు చివరి అంకానికి చేరింది. అమెరికా స్టార్‌ వీనస్‌ విలియమ్స్, స్పెయిన్‌ క్రీడాకారిణి ముగురుజా టైటిల్‌ పోరుకు అర్హత పొందారు. ఇప్పటికే ఐదు సార్లు వింబుల్డన్‌ టైటిల్‌ గెలిచిన వీనస్‌ తన ఆరో టైటిల్‌ కోసం తహతహలాడుతుండగా, జోరుమీదున్న స్పెయిన్‌ స్టార్‌ ముగురుజా వింబుల్డన్‌ వేదికపై కొత్త చాంపియన్‌గా అవతరించేందుకు సిద్ధమైంది.

లండన్‌: మాజీ చాంపియన్‌ వీనస్‌ విలియమ్స్, స్పానిష్‌ టెన్నిస్‌ స్టార్‌ గార్బిన్‌ ముగురుజా అమీతుమీకి సిద్ధమయ్యారు. వింబుల్డన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో వీరిద్దరు మహిళల టైటిల్‌ పోరుకు అర్హత సాధించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో 14వ సీడ్‌ ముగురుజా వరుస సెట్లలో 6–1, 6–1తో మగ్దలినా రిబరికోవా (స్లోవేకియా)పై అలవోక విజయం సాధించగా, పదో సీడ్‌ వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) 6–4, 6–2తో ఆరో సీడ్‌ జొహానా కొంటా (బ్రిటన్‌)ను కంగుతినిపించింది. వీనస్, ముగురుజాల మధ్య శనివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది.

రెండోసారి ఫైనల్‌కు...
 ఫ్రెంచ్‌ ఓపెన్‌ మాజీ చాంపియన్, ప్రపంచ 15వ ర్యాంకర్‌ ముగురుజా రెండోసారి వింబుల్డన్‌ ఫైనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2015లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఆమె ఇప్పుడు మాత్రం టైటిల్‌ సాధించాలన్న పట్టుదలను తన మ్యాచ్‌ల్లో చూపింది. సెమీస్‌లో అన్‌సీడెడ్‌ ప్రత్యర్థిని కేవలం గంట 5 నిమిషాల్లోనే మట్టికరిపించింది. ఆమె ధాటికి రిబరికోవా నిలువలేకపోయింది. రెండు సెట్లలోనూ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. తొలి సెట్‌లో 8 విన్నర్స్‌ను కొట్టిన ముగురుజా రెండో సెట్‌లో తన జోరు పెంచింది. దీంతో ఏకంగా 14 విన్నర్స్‌ను సాధించింది. ఇద్దరు చెరో 3 ఏస్‌లు సంధించారు.

ముగురుజా 11 అనవసర తప్పిదాలు చేసింది. ఐదు బ్రేక్‌ పాయింట్లు సాధించింది. రిబరికోవా కూడా 11 అనవసర తప్పిదాలు చేసింది. కానీ కోర్టులో చురుగ్గా కదల్లేకపోయింది. ముగురుజా ఫోర్‌హ్యాండ్‌ షాట్లకు బదులివ్వలేకపోయింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 87వ ర్యాంకులో ఉన్న రిబరికోవా ఒక్క వింబుల్డన్‌ ఓపెన్‌ మినహా మరే గ్రాండ్‌స్లామ్‌లోనూ మూడో రౌండ్‌ దాటలేదు. కానీ ఈ ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో మాత్రం ఆమె 2014లో సెమీఫైనల్స్‌ చేరింది. ఈసారీ ఆమె పోరాటం సెమీస్‌ అడ్డంకిని దాటలేకపోయింది.

వీనస్‌ జోరు
తన సుదీర్ఘ కెరీర్‌లో 7 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన వీనస్‌కు గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో బ్రిటన్‌ క్రీడాకారిణి జొహానా కొంటా తొలి సెట్‌లో గట్టిపోటీనిచ్చింది. అనుభవజ్ఞురాలైన వీనస్‌కు ఏస్‌లతో బదులిచ్చింది. ఏస్‌ల్లో వీనస్‌ పూర్తిగా వెనుకబడగా... జొహానా మాత్రం 7 ఏస్‌లను సంధించింది. విన్నర్స్‌లోనూ బ్రిటన్‌ ప్లేయర్‌దే పైచేయి అయింది. జొహానా కొంటా 14 విన్నర్స్‌ కొడితే వీనస్‌ ఐదే కొట్టగలిగింది. అయితే పదే పదే అనవసర తప్పిదాలతో పాటు డబుల్‌ ఫాల్ట్‌లతో జొహానా మూల్యం చెల్లించుకుంది. 13 అనవసర తప్పిదాలు, 4 డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. మ్యాచ్‌ మొత్తం మీద ఒకే ఒక్క ఏస్‌ సంధించిన వీనస్‌ 4 బ్రేక్‌ పాయింట్లతో పోరులో నిలిచింది. రెండో సెట్‌లో జోరు పెంచిన వీనస్‌ 11 విన్నర్స్‌ సాధించగా... ప్రత్యర్థి జొహానా 6 విన్నర్స్‌ కొట్టింది. దీంతో తొలిసెట్‌లో చెమటోడ్చినప్పటికీ రెండో సెట్‌ను త్వరగానే ముగించింది. గంటా 13 నిమిషాల్లో ప్రత్యర్థి ఆట కట్టించి ఫైనల్లోకి ప్రవేశించింది.

►మార్టినా నవ్రతిలోవా (1994) తర్వాత ఏ గ్రాండ్‌స్లామ్‌లోనైనా ఫైనల్‌ చేరిన అతి పెద్ద వయస్కురాలు (37 ఏళ్లు) వీనస్‌.

► వింబుల్డన్‌లో అత్యధిక విజయాలు సాధించిన మహిళల జాబితాలో మూడో స్థానానికి చేరిన వీనస్‌ (87)... ఈ క్రమంలో
సోదరి సెరెనా (86)నుఅధిగమించింది. నవ్రతిలోవా (120), క్రిస్‌ ఎవర్ట్‌ (96) ఈ జాబితాలో ముందున్నారు.

►వింబుల్డన్‌లో వీనస్‌ ఫైనల్‌ చేరడం ఇది 9వ సారి. 2009లో ఆఖరిసారిగా ఫైనల్‌ చేరి సెరెనా చేతిలో ఓడింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement