రోహిత్ మెరుపులు.. ముంబై అదరహో
కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో ఓటమితో ఆరంభించిన ముంబై ఇండియన్స్ తమ రెండో మ్యాచ్ లో సత్తాచాటింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో బుధవారం రాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తమ అసలైన ఆటతీరును ప్రదర్శించి మరో ఐదు బంతులు ఉండగానే 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ(84 పరుగులు; 54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి విజయాన్ని అందించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా బ్యాట్స్ మన్ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. టార్గెట్ ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మకు మరో ఓపెనర్ పార్థీవ్ పటేల్(23), మెక్ క్లెనగన్(20 పరుగులు; 8 బంతుల్లో 3 సిక్సర్లు), చివర్లో బట్లర్ (41 పరుగులు; 22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు జతవ్వడంతో ముంబై విజయం నల్లేరుపై నడకగా మారింది. లక్ష్యం ఎక్కువగా ఉన్నప్పటికీ ఏ దశలోనూ ముంబై ఆటగాళ్లు వెనక్కి తగ్గలేదు. కోల్ కతా బౌలర్లలో రస్సెల్, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.
కోల్ కతా ఇన్నింగ్స్:
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా కెప్టెన్ గౌతం గంభీర్ (64 పరుగులు; 52 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), మనీష్ పాండే (52 పరుగులు; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రస్సెల్ (36 పరుగులు; 17 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) సూపర్ ప్రదర్శనతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్ క్లెనగన్ రెండు వికెట్లు పడగొట్టగా, పాండ్యా, హర్బజన్ చెరో వికెట్ తీశారు.