
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్‌గా చేయాలన్న ఆ దేశ క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) ఆఫర్‌ను దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీ ధరన్ తిరస్కరించాడు. అంతకుముందు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే సైతం కన్సల్టెంట్ ఆఫర్‌ను తిరస్కరించగా, ఇప్పుడు ఆ జాబితాలో మురళీ ధరన్ చేరిపోయాడు. తనకు శ్రీలంక క్రికెట్ జట్టు సలహాదారుగా చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన మురళీ.. ఇందుకు ప్రస్తుత ఎస్‌ఎల్‌సీ విధానం సరిగా లేకపోవడమే కారణమన్నాడు. దీనిలో భాగంగా ఎస్‌ఎల్‌సీ నమ్మకాన్ని కోల్పోయిందంటూ విమర్శనాస్త్రాలు సంధించాడు.
‘నాకు శ్రీలంక క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్‌గా చేయమంటూ వచ్చిన ఆఫర్‌లో నిజాయితీ లేదు. అదొక కపటపు ఎత్తుగడ. మా బోర్డు ఎప్పుడో నమ్మకాన్ని కోల్పోయింది. ప్రస్తుతం ఎస్‌ఎల్‌సీ అవలంభించే విధానంలో విశ్వాసం లోపించింది. ఇప్పుడు మా సహకారం కావాలని శ్రీలంక క్రికెట్ పరిపాలన కమిటీ కోరడం నిజంగా శోచనీయం’ అని మురళీ ధరన్ మండిపడ్డాడు.
మరొకవైపు లంక క్రికెట్ కమిటీలో పనిచేసిన జయవర్ధనే సైతం దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘మా క్రికెట్ బోర్డు విధానం సరిగా లేదు. మమ్మల్ని ఉపయోగించుకోవాలని క్రికెట్ పెద్దలు చూస్తున్నారు. మమ్మల్ని కొనాలని చూస్తే అది ఎంతమాత్రం లాభించదు’ అని జయవర్ధనే వ్యాఖ్యానించాడు.
గతేడాది శ్రీలంక క్రికెట్ ప్రక్షాళనలో భాగంగా ఒక స్పెషల్ ప్యానల్‌ను నియమించిన సంగతి తెలిసిందే. అందులో జయవర్ధనే సభ్యుడిగా ఉన్నాడు. అయితే అప్పట్లో జయవర్ధనే సూచించిన ప్రతిపాదనలకి శ్రీలంక క్రికెట్ బోర్డు విలువ ఇవ్వకపోవడంతో మళ్లీ ఆ తరహా అనుభవాన్ని చూడకూడదనే ఆలోచనలో జయవర్ధనే ఉన్నాడు. ఆ క్రమంలోనే తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు చేసిన విన్నపాన్ని మాజీ కెప్టెన్ తిరస్కరించాడు.
ఇటీవల కాలంలో విజయాల కోసం తంటాలు పడుతున్న శ్రీలంక జట్టును గాడిలో పెట్టేందుకు సీనియర్ ఆటగాళ్లతో ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేయాలనే యోచనలో లంక బోర్డు ఉంది. ఇందులో జయవర్ధనే, మురళీ ధరన్, కుమార సంగక్కార పేర్లను కూడా చేర‍్చింది. ఈ మేరకు కమిటీకి అనుమతి ఇవ్వాలని క్రీడామంత్రికి తమ విన్నపాన్ని పంపింది. అయితే సెలక్టర్లు చేసిన ప‍్రతిపాదనను మరో ఆలోచన లేకుండా మురళీ ధరన్, జయవర్ధనేలు తిరస్కరించడం లంక బోర్డుకు షాకిచ్చినట్లయ్యింది.