గుండె పగిలినంతపనైంది: క్రికెటర్
బెంగళూరు: గాయంతో జట్టుకు దూరం కావడం పట్ల టీమిండియా బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. స్వదేశంలో సిరీస్ జరుగుతుండగా తాను ఇంటికే పరిమితం కావాల్సి రావడం దురదృష్టకరంగా పేర్కొన్నాడు. తొడ కండరాల గాయంతో ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవడం బోర్ కొట్టిందని చెప్పాడు. తన మనసంతా టీమిండియాతోనే ఉందని ‘బీసీసీఐ టీవీ’తో మాట్లాడుతూ అన్నాడు.
‘చాలా కాలం తర్వాత హోం సిరీస్ లో ఆడలేకపోవడం బాధ కలిగించింది. గాయంతో జట్టుకు దూరం కావడంతో గుండె పగిలినంతపనైంది. విదేశాల్లో చాలా సిరీస్ లు ఆడాను. ప్రస్తుతం ఫామ్ లో ఉన్నాను. హోంసిరీస్ లో బాగా ఆడాలని అనుకున్నాను. గాయంతో నా ఆశలపై నీళ్లు చల్లింద’ని వాపోయారు.
విశ్రాంతి సమయంలో ఫిట్ నెస్ పై దృష్టి పెట్టానని చెప్పాడు. ‘ఖాళీగా ఇంటిదగ్గర కూర్చోవడం బోర్ కొట్టింది. ఈ ఆరు వారాలు భారంగా గడిచింది. మొదటి రెండు వారాలు అయితే ఏమీ చేయలేకపోయాను. ఉదయం నిద్ర లేవగానే ఫిజియోథెరపిస్ట్ దగ్గరకు వెళ్లడం, తర్వాత రీహెబిలిటేషన్ సెంటర్ లో గడపడంతోనే సరిపోయింది. మళ్లీ జట్టులోకి ఎప్పుడు వస్తానా అని ఆలోచిస్తూనే గడిపాను. నా మనసంతా టీమిండియాతోనే ఉండేది. టీమ్ లో ఉన్నట్టే అనుకునేవాడిని. ఫుల్ ఫిట్ నెస్ సాధించి తొందరగా జట్టులో చేరాలని తపన పడుతుండేవాడిన’ని రాహుల్ చెప్పాడు. విశాఖపట్నంలో గురువారం నుంచి ఇంగ్లండ్ తో జరగనున్న రెండో టెస్టులో రాహుల్ ఆడనున్నాడు.