సన్ రైజర్స్ కు కఠిన పరీక్ష
హైదరాబాద్:సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరోసారి కఠిన పరీక్ష ఎదురుకానుంది. శనివారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ మ్యాచ్ ద్వారా సొంతగడ్డపై తొలిఓటమి చవిచూసిన సన్ రైజర్స్.. తాజాగా పటిష్టమైన ముంబై ఇండియన్స్ తో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకోవాలని సన్ రైజర్స్ భావిస్తుండగా, ఇప్పటికే నాకౌట్ కు చేరిన ముంబై ఇండియన్స్ మాత్రం మరో విజయంపై కన్నేసింది. ఇరు జట్ల మధ్య ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
వరుసగా రెండు పరాజయాలతో డీలా పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్లే ఆఫ్స్‌లో చోటే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గాల్సిన స్థితిలో తీవ్ర ఒత్తిడిలో వార్నర్‌సేన ఈ మ్యాచ్ ఆడుతోంది. ఈ సీజన్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా రాణించింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఐదింటిలో విజయం సాధించింది. రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ మ్యాచ్ ద్వారా సొంతగడ్డపై తొలిఓటమి నమోదు చేసింది. పుణే విధించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు.
ముఖ్యంగా డేవిడ్ వార్నర్, యువరాజ్ సింగ్ ఆకట్టుకున్నా మిగతా ప్లేయర్లు శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్, నమన్ ఓజా తదీతరులు విఫలమవడం జట్టు కొంపముంచింది. ఈ క్రమంలో జట్టు మిడిలార్డర్ మరింత బాధ్యతయుతంగా వ్యవహరించాల్సి ఉంది. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ ఆరు విజయాలు, ఐదు పరాజయాలు నమోదు చేసింది. ఈ సీజన్‌లో అందరింకంటే ముందుగా ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ ఘనత వహించింది. ఓవరాల్‌గా 11 మ్యాచ్‌లాడిన ముంబై తొమ్మిది విజయాలు, రెండు పరాజయాలు నమోదు చేసింది. దీంతో 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.