సన్ రైజర్స్ కు సాధారణ లక్ష్యం
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా సోమవారం ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 139 పరుగుల సాధారణ లక్ష్యాన్నినిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ ఆది నుంచి తడబడింది. ముంబై ఓపెనర్ లెండిల్ సిమన్స్(1), నితీశ్ రానా(9)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తరువాత పార్ధీవ్ పటేల్ (23) కూడా కొద్ది వ్యవధిలోనే వికెట్ కోల్పోవడంతో ముంబై 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యాల జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 60 పరుగులు జత చేయడంతో ముంబై కాస్త కుదుటపడింది.
కాగా, హార్దిక్ పాండ్యా(15) ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేదు. ఆపై రోహిత్ -పొలార్డ్ లు నెమ్మదిగా ఇన్నింగ్స్ కొనసాగించారు. ఈ క్రమంలోనే 34 బంతుల్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు.కాగా రోహిత్ శర్మ(67;45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అవుటైన తరువాత పొలార్డ్(5), కరణ్ శర్మ(5)లు కూడా నిష్క్రమించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.
ఆకట్టుకున్న సిద్ధార్ధ్ కౌల్
ప్లే ఆఫ్ కు చేరాలంటే కచ్చితంగా రాణించాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్ సిద్ధార్ధ్ కౌల్ ఆకట్టుకున్నాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు కీలక వికెట్లను సాధించాడు. ఆది నుంచి చక్కటి లైన్ లెంగ్త్ తో బౌలింగ్ వేసిన కౌల్..పార్ధీవ్ పటేల్, నితీశ్ రానా, రోహిత్ శర్మ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో పాటు నాలుగు ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతనికి జతగా మొహ్మద నబీకి కూడా మెరిశాడు. నాలుగు ఓవర్లలో 13 పరుగులిచ్చిన నబీ వికెట్ ను తీశాడు.