15 ఏళ్ల తర్వాత టీమిండియా పిలుపు.. | Nadeem Reveals When He Received His India Call Up | Sakshi
Sakshi News home page

15 ఏళ్ల తర్వాత టీమిండియా పిలుపు..

Published Tue, Oct 22 2019 12:38 PM | Last Updated on Tue, Oct 22 2019 12:51 PM

Nadeem Reveals When He Received His India Call Up - Sakshi

రాంచీ: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేసిన టీమిండియా స్పిన్నర్‌ షహ్‌బాజ్‌ నదీమ్‌ మొత్తం నాలుగు వికెట్లు సాధించి విజయంలో భాగమయ్యాడు. అయితే తన కెరీర్‌లో జాతీయ జట్టు తరఫున తొలి మ్యాచ్‌ ఆడుతుండటంపై ఒకింత ఉద్వేగానికి లోనయ్యనట్లు నదీమ్‌ పేర్కొన్నాడు. ఫీల్డ్‌లో దిగాక ఆరంభంలో కాస్త ఒత్తిడికి లోనైనట్లు తెలిపాడు.  సఫారీల రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా మూడో రోజు మ్యాచ్‌ తర్వాత నదీమ్‌ మాట్లాడుతూ.. తొలి ఓవర్‌ ఇబ్బందిగా అనిపించింది. ముఖ్యంగా నేను వేసిన మూడు బంతుల వరకూ నాలో తెలియని భయం ఏర్పడింది. ఆ తర్వాత ఫ్రీగా బౌలింగ్‌ చేశా. నాకు అనూహ్యంగా భారత జట్టు నుంచి పిలుపు రావడం ఊహించలేదు. నేను చాలాకాలం నుంచి క్రికెట్‌ ఆడుతూనే ఉన్నా.

కాకపోతే అనుకోకుండా టీమిండియా మేనేజ్‌మెంట్‌ను కాల్‌ రావడం సంతోషాన్నిచ్చింది. నాకు కాల్‌ వచ్చిన సమయంలో నేను నమాజ్‌ చేసుకుంటున్నా. నాకు కాల్‌ రావడాన్ని గ్రహించా. నేను నమాజ్‌ను పూర్తి చేసుకుని కాల్‌ లిఫ్ట్‌ చేశా. శనివారం మ్యాచ్‌ అయితే శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నాకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. రేపటి మ్యాచ్‌కు సిద్ధం కావాలంటూ ఫోన్‌ ద్వారా తెలిపారు. నేను కోల్‌కతా నుంచి రోడ్డు మార్గం ద్వారా రాంచీకి బయల్దేరా’ అని నదీమ్‌ తెలిపాడు. దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బావుమాను మెయిడిన్‌ వికెట్‌గా ఖాతాలో వేసుకున్న నదీమ్‌.. నోర్జేను రెండో వికెట్‌గా దక్కించుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో చివరి రెండు వికెట్లుగా బ్రుయిన్‌, ఎన్‌గిడీలను ఔట్‌ చేసి మ్యాచ్‌కు ఫినిషింగ్‌ ఇచ్చాడు.

15 ఏళ్ల తర్వాత పిలుపు..
ఫస్ట్‌క్లాస్‌ అరంగేట్రాన్ని 2004లోనే ఆరంభించిన నదీమ్‌.. లిస్ట్‌-ఏ క్రికెట్‌ను 2005లోనే ప్రారంభించాడు.అంతర్జాతీయ అరంగేట్రం కోసం దాదాపు 15 ఏళ్లు నిరీక్షించాడు. ఈ వ్యవధిలో చాలామంది అంతర్జాతీయ అరంగేట్రం చేసినా నదీమ్‌కు మాత్రం అవకాశం రాలేదు. ఎంఎస్‌ ధోని కలిసి జార్ఖండ్‌ తరఫున ఆడిన అనుభవం నదీమ్‌ది. ధోని కెరీర్‌ దాదాపు ముగింపు దశకు వచ్చేసిన సమయంలో నదీమ్‌కు చోటు రావడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి విషయం. 2015-16, 2016-17 వరుస రంజీ సీజన్‌లో 50 వికెట్లుకు పైగా సాధించినా నదీమ్‌కు భారత జట్టు నుంచి పిలుపు రాకపోవడం బాధాకరం. కానీ తన ఆశల్ని వదులు కోలేదు నదీమ్‌. జాతీయ జట్టులో చోటు కోసం తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నాడు.

ఇటీవల వెస్టిండీస్‌-ఏతో జరిగిన సిరీస్‌లో భాగంగా అనధికారిక తొలి టెస్టులో మొత్తం పది వికెట్లు సాధించాడు. ఆ పర్యటనలో మరో మ్యాచ్‌లో కూడా నదీమ్‌ రాణించడంతో సెలక్టర్లను ఆకర్షించాడు. అదే సమయంలో టీమిండియా చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ గాయం కారణంగా వైదొలగడంతో నదీమ్‌కు అవకాశం వచ్చింది. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల తరఫున ఆడిన నదీమ్‌.. జాతీయ జట్టులో వచ్చిన ఒక చక్కటి అవకాశాన్ని నిలబెట్టుకున్నాడనే చెప్పాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement