
న్యూఢిల్లీ: హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్‌లో జరిగే క్రీడా అవార్డుల ప్రదా నోత్సవ కార్యక్రమం ఈసారి సెప్టెంబర్ 25న జరుగనుంది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆసియా క్రీడలు జరుగనుండటంతో క్రీడా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ క్రీడల్లో సత్తాచాటిన వారి పేర్లను కూడా అవార్డులకు పరిశీలిస్తామని పేర్కొంది. నిజానికి ఏప్రిల్ 30వ తేదీలోపు వచ్చిన ఎంట్రీల ఆధారంగానే అవార్డులు ప్రకటిస్తారు.
కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తేదీల మార్పు అంశాన్ని రాష్ట్రపతి భవన్ దృష్టికి తీసుకెళ్లగా అక్కడి నుంచి కూడా సానుకూల స్పందన వచ్చినట్లు క్రీడా కార్యదర్శి రాహుల్ తెలిపారు. దీంతో పాటు ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారి పేర్లను కూడా అవార్డుల కోసం పరిశీలించాలని కమిటీకి సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.