నెహ్రా రిటైర్మెంట్‌ యోచన! | Nehra retirement plans! | Sakshi
Sakshi News home page

నెహ్రా రిటైర్మెంట్‌ యోచన!

Published Wed, Oct 11 2017 12:04 AM | Last Updated on Wed, Oct 11 2017 3:55 AM

Nehra retirement plans!

న్యూఢిల్లీ: 38 ఏళ్ల వయసులో భారత టి20 జట్టులో మళ్లీ స్థానం సంపాదించి అందరినీ ఆశ్చర్యపరచిన పేసర్‌ ఆశిష్‌ నెహ్రా మరో ఆశ్చర్యకర నిర్ణయానికి సిద్ధమయ్యాడు. త్వరలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో తన ఆఖరి మ్యాచ్‌ ఆడి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు సమాచారం. నవంబర్‌ 1న సొంత గడ్డ న్యూఢిల్లీలో కివీస్‌తో జరిగే తొలి టి20 మ్యాచ్‌ నెహ్రాకు ఆఖరి మ్యాచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తాను అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఉన్నానని, కుర్రాళ్లతో పోటీ పడుతూ బౌలింగ్‌ చేయగల సత్తా ఉండటం వల్ల మళ్లీ ఎంపికయ్యానని గర్వంగా చెప్పుకున్న నెహ్రా... అంతలోనే తప్పుకునేందుకు సిద్ధం కావడం అనూహ్యం. యువరాజ్, రైనాలాంటి వారిని కాదని నెహ్రాను ఈ వయసులో పొట్టి ఫార్మాట్‌కు ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి.

అయితే అతని మాజీ సహచరుడు వీరేంద్ర సెహ్వాగ్‌ తదితరులు ‘40 ఏళ్ల వయసులో సచిన్‌ ఆడగా లేనిది నెహ్రా ఆడితే తప్పేంటి’ అంటూ అతడికి గట్టి మద్దతు పలికారు. ప్రత్యేకంగా కారణమంటూ చెప్పకపోయినా... మరిన్ని విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ఇక ఆట చాలించాలని నెహ్రా భావిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌ కోసం అతడిని ఎంపిక చేసినా, తొలి రెండు మ్యాచ్‌లలో తుది జట్టులో అవకాశం లభించలేదు. 26 టి20 మ్యాచ్‌లలో నెహ్రా 7.75 ఎకానమీతో 34 వికెట్లు పడగొట్టాడు. 2011 వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో పాకిస్తాన్‌పై తన ఆఖరి వన్డే ఆడిన ఈ వెటరన్‌ మొత్తం 120 వన్డేల్లో 31.72 సగటుతో 157 వికెట్లు తీశాడు. నెహ్రా టెస్టు కెరీర్‌ 2004లోనే 17 మ్యాచ్‌లతో ముగిసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement