'అప్పటివరకు ధోని కొనసాగాలి'
మెగా ఈవెంట్ నేపథ్యంలో టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ పై ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడు క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరుగుతోంది. చాంపియన్స్ ట్రోఫీ 2017, జూన్ లో జరగనుంది. అయితే 2019 వన్డే ప్రపంచ కప్ వరకు ధోని కొనసాగాలని మాజీ క్రికెటర్లు కోరుకుంటున్నారు.
'వచ్చే వన్డే వరల్డ్ కప్ నాటికి ధోని వయసు 38 ఏళ్లు. ఈ రోజుల్లో క్రికెట్ లో కొనసాగడానికి ఇదేమంత పెద్ద వయసు కాదు. పాకిస్థాన్ ఆటగాళ్లు యూనిస్ ఖాన్, మిస్బా-వుల్-హక్.. 40 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడుతున్నారు. అయితే 2019 వరకు ఫిట్ నెస్ కాపాడుకుంటే ధోని కూడా కొనసాగవచ్చు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోని ఇప్పుడే వైదొలగాల్సిన అవసరం కనబడడం లేద'ని మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా అన్నాడు.
ఇదే అభిప్రాయాన్ని మాజీ కెప్టెన్ రవిశాస్త్రి వ్యక్తం చేశాడు. 'కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లా ధోని కూడా గొప్ప ఆటగాడు. 2019 వరకు అతడు ఆడాలి. అతడి లాంటి ఆటగాడు సమీప భవిష్యత్తులో లభించడం కష్టం. తనదైన ఆటతీరుతో సమకాలిన క్రికెట్ లో ధోని చెరగని ముద్ర వేశాడ'ని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో ఫిట్ నెస్ చాలా కీలకమని, ఫిట్ గా ఉంటే 2019 వరకు ధోని కొనసాగుతాడని మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ధోని రిటైర్ అవుతాడా, వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగుతాడా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.