
'మూడు' లోనూ మట్టికరిచిన బ్రెజిల్
బ్రసిల్లా: ఫుట్బాల్ ప్రపంచకప్ లో ఆతిథ్య దేశం బ్రెజిల్ కు కలిసిరాలేదు. టైటిల్ రేసులో నిలవలేకపోయిన సాంబ టీమ్ కనీసం మూడో స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. మూడో స్థానం కోసం నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఓడిపోయి చేదు అనుభవవాన్ని మూటగట్టుకుంది. సెమీస్ ఫైనల్లో పెనాల్టీ షూట్ తో అర్జెంటీనా చేతిలో ఓడిన నెదర్లాండ్స్ మూడో స్థానాన్ని దక్కించుకుని ఊరట చెందింది. 3-0 గోల్స్ తేడాతో బ్రెజిల్ ను ఓడించింది.
ఆట తొలి అర్థభాగంలో రెండు గోల్స్ సాధించిన నెదర్లాండ్స్ ఇంజ్యూరీ సమయంలో మరో గోల్ సాధించి విజయాన్ని అందుకుంది. ఆట మూడో నిమిషంలోనే నెదర్లాండ్ కెప్టెన్ రాబిన్ వాన్ పెర్సీ గోల్ కొట్టాడు. 17 నిమిషంలో డెలే బ్లిండ్ మరో గోల్ సాధించాడు. ఆట ద్వితీయార్థంలో గోల్ చేసేందుకు బ్రెజిల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివర్లో ఇంజ్యూరీ సమయంలో నెదర్లాండ్ ఆటగాడు జియార్జినియో విజ్నాల్డమ్ మరో గోల్ చేయడంతో జట్టు ఆధిక్యం 3-0కు పెరిగింది.