సై అంటే సై...
ఆరు ఫ్రాంచైజీలు... ఆరు వేదికలు... ప్రత్యర్థులుగా మారనున్న సహచరులు... అగ్రశ్రేణి అంతర్జాతీయ క్రీడాకారులతో కలిసి ఆడే అవకాశం... కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ... మొత్తానికి ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) రూపంలో బుధవారం బ్యాడ్మింటన్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేవనుంది. 15 రోజులపాటు జరిగే ఈ బ్యాడ్మింటన్ పండుగకు రంగం సిద్ధమైంది. ఇక ఆస్వాదించడమే తరువాయి...!
న్యూఢిల్లీ: ఆరంభ విఘ్నాలను అధిగమించిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. బుధవారం న్యూఢిల్లీలో మొదలయ్యే ఈ లీగ్ ఈనెల 31న ముంబైలో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. సైనా నెహ్వాల్, సింధు, కశ్యప్, శ్రీకాంత్, సాయిప్రణీత్, గురుసాయిదత్ తదితర భారత క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో నిలకడగా విజయాలు సాధిస్తుండటంతో ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత్ తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో జరుగుతోన్న ఈ లీగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ ఈ లీగ్ విజయవంతమైతే మున్ముందు భారత్‌లో బ్యాడ్మింటన్ ప్రధాన క్రీడగా ఎదిగే అవకాశముంది.
ఫేవరెట్ ఎవరో?
లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ లీగ్‌లో తొలిసారి విజేతగా ఎవరు నిలుస్తారో ఊహించడం కాస్త కష్టంగానే ఉంది. ఆరు జట్ల నుంచి నాలుగు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి కాబట్టి చివరి లీగ్ మ్యాచ్ వరకు ఏ ఏ జట్లు సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటాయో వేచి చూడాలి. ఆయా జట్ల సమీకరణాలను పరిశీలిస్తే... హైదరాబాద్ హాట్‌షాట్స్, అవధ్ వారియర్స్, పుణే పిస్టన్స్, ముంబై మాస్టర్స్ సెమీఫైనల్ చేరుకునే అవకాశముంది. అయితే బంగా బీట్స్, ఢిల్లీ స్మాషర్స్ జట్లనూ తక్కువ అంచనా వేయలేం. ఒక్కో పోటీల్లో మూడు సింగిల్స్ మ్యాచ్‌లు ఉన్నందున డబుల్స్ మ్యాచ్‌లు కూడా కీలకమయ్యే అవకాశాలున్నాయి.
లీ చోంగ్ వీ అనుమానం!
చైనా నుంచి దాదాపు అగ్రశ్రేణి క్రీడాకారులందరూ ఈ లీగ్‌కు దూరంగా ఉన్నారు. దాంతో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) ఈ లీగ్‌కు ప్రధాన ఆకర్షణ అయ్యాడు. అయితే గత ఆదివారం లిన్ డాన్ (చైనా)తో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా లీ చోంగ్ వీ మోకాలి గాయంతో వైదొలిగాడు. నొప్పి తీవ్రంగా ఉండటంతో అతణ్ని మైదానంలో నుంచి స్ట్రెచర్‌పై నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో లీ చోంగ్ వీ ఐబీఎల్‌లో బరిలోకి దిగుతాడో లేదో అనుమానంగా మారింది.
ప్రతి పోటీలో ఐదు మ్యాచ్‌లు ఉంటాయి. ఇందులో రెండు పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లతోపాటు ఒక్కో మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లుంటాయి.
ప్రతి మ్యాచ్ ‘బెస్ట్ ఆఫ్ త్రీ’ గేమ్స్ పద్ధతిలో జరుగుతుంది. తొలుత 21 పాయింట్లు సాధించిన వారికి గేమ్ దక్కుతుంది. చెరో గేమ్ గెల్చుకుంటే నిర్ణాయక మూడో గేమ్‌లో మొదట 11 పాయింట్లు నెగ్గినవారు విజేతగా నిలుస్తారు.
తొలి రెండు గేమ్‌ల్లో 7వ పాయింట్, 14వ పాయింట్ ముగిశాక నిమిషం చొప్పున విరామాలు ఉంటాయి. నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం ఆరో పాయింట్ ముగిశాక ఈ విరామం ఉంటుంది.
8 ప్రతి ఫ్రాంచైజీ జట్టులో 11 ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో నలుగురు విదేశీ ఆటగాళ్లు... ఆరుగురు భారత క్రీడాకారులు... ఒకరు జూనియర్ ఇండియా జట్టు సభ్యుడు ఉంటారు.
లీగ్ దశ ముగిశాక తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
ఒక జట్టు ఒక పోటీని 5-0తో గెలిస్తే ఆ జట్టుకు బోనస్ పాయింట్‌తో కలిపి మొత్తం ఆరు పాయింట్లు లభిస్తాయి. 4-1తో గెలిస్తే ఐదు పాయింట్లు... 3-2తో గెలిస్తే నాలుగు పాయింట్లు వస్తాయి.
రూ. 6.13 కోట్లు
మొత్తం ప్రైజ్‌మనీ
10 లక్షల డాలర్లు.
విజేత జట్టుకు 65 శాతం... రన్నరప్ జట్టుకు 35 శాతం
ప్రైజ్‌మనీ ఇస్తారు.
ఐబీఎల్‌లో నేడు
ఢిల్లీ x స్మాషర్స్
పుణే పిస్టన్స్
రా. గం. 8 నుంచి ఈఎస్‌పీఎన్‌లో లైవ్
సా. గం. 6.30కు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది