
అక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్, సమీర్ వర్మ, లక్ష్యసేన్, అజయ్ జయరామ్ తొలి రౌండ్‌లో విజయం సాధించి ముందంజ వేశారు. పదిహేడేళ్ల లక్ష్యసేన్ రెండో రౌండ్లో బ్యాడ్మింటన్ దిగ్గజం, టాప్ సీడ్ లిన్ డాన్‌తో తలపడనున్నాడు. నేడు జరిగే పోరులో ఈ యువ షట్లర్ తన కెరీర్‌లోనే అతి పెద్ద మ్యాచ్ ఆడనున్నాడు. లక్ష్యసేన్ తొలి రౌండ్‌లో 21–11, 21–16తో జూన్ వెయి చీమ్ (మలేసియా)పై గెలుపొందాడు.
సాయి ప్రణీత్ 21–11, 21–19తో మిశా జిబెర్మాన్ (ఇజ్రాయిల్)పై; సమీర్ వర్మ 21–8, 21–10తో సోని డి కున్‌కోరో (ఇండోనేసియా)పై; అజయ్ జయరామ్ 21–23, 21–12, 21–18తో జెన్ హో (తైవాన్)పై గెలుపొందారు. సౌరభ్ వర్మ 19–21, 21–14, 19–21తో అభినవ్ మనోత్ర (ఆస్ట్రేలియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో వైష్ణవి రెడ్డి, సాయి ఉత్తేజిత ఓటమి పాలయ్యారు. వైష్ణవి 16–21, 19–21తో చు వెన్డీ చెన్ (ఆస్ట్రేలియా) చేతిలో, ఉత్తేజిత 14–21, 13–21తో యుకినో నకాయి (జపాన్) చేతిలో ఓడిపోయారు.