ఆక్లాండ్: వన్డే సిరీస్‌ను రెండు వరుస విజయాలతో కైవసం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు టి20 సిరీస్‌ను మాత్రం రెండు వరుస ఓటములతో కోల్పోయింది. అయితే, తొలి మ్యాచ్ తరహాలో కాకుండా ఈసారి చివరి వరకు పోరాడింది. కీలక సమయంలో ఒత్తిడి అధిగమించిన ఆతిథ్య న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి పరుగు తీసి 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. మూడో టి20 ఆదివారం హామిల్టన్‌లో జరుగుతుంది.
బ్యాటింగ్‌లో మళ్లీ తడబాటు...
సిరీస్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో శుక్రవారం టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హర్మన్ ప్రీత్ బృందం మిడిలార్డర్ వైఫల్యంతో మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులే చేసింది. ఓపెనర్ ప్రియా పూనియా (4) త్వరగానే వెనుదిరగ్గా... మరో ఓపెనర్ స్మృతి మంధాన (27 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్), వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (53 బంతుల్లో 72; 6 ఫోర్లు, 1 సిక్స్) దూకుడు చూపారు. 44 బంతుల్లోనే 63 పరుగులు జోడించారు. దీంతో పదో ఓవర్లోనే జట్టు స్కోరు 71కి చేరుకుంది. ఈ దశలో కివీస్ అమ్మాయిలు కట్టడి చేశారు.
మంధానతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (5), దీప్తిశర్మ (1)లను వెంటవెంటనే ఔట్ చేశారు. హేమలత (2) రిటైర్డ్ హర్ట్‌గా క్రీజును వీడింది. వేగంగా ఆడబోయి జెమీమా స్టంపౌటైంది. టీమిండియా చివరి 10 ఓవర్లలో 63 పరుగులే చేయగలిగింది. రోజ్‌మేరీ మైర్ (2/17) పొదుపుగా బౌలింగ్ చేసింది. ఛేదనలో కివీస్ ఆరు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసి సరిగ్గా 20వ ఓవర్ చివరి బంతికి విజయాన్ని అందుకుంది. 33 పరుగులు జోడించి ఓపెనర్లు సుజీ బేట్స్ (52 బంతుల్లో 62; 5 ఫోర్లు), సోఫియా డివైన్ (19) శుభారంభం ఇచ్చారు. డివైన్, వన్‌డౌన్ బ్యాటర్ కైట్లిన్ గ్యురె (4)ను ఔట్ చేసి టీమిండియా పట్టు సాధించింది.
బేట్స్, కెప్టెన్ సాటర్‌వైట్ (23) మూడో వికెట్‌కు 61 పరుగులు జత చేయడంతో న్యూజిలాండ్ గెలుపు సులువే అనిపించింది. వీరితో పాటు అన్నా పీటర్సన్ (0) త్వరగా ఔటవడం ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి రావడంతో ఉత్కంఠ నెలకొంది. తొలి బంతికి ఫోర్ కొట్టిన వికెట్ కీపర్ క్యాటీ మార్టిన్ (13) రెండో బంతికి బౌల్డయింది. లిసా కాస్పరెక్ (4 నాటౌట్), రోయి (4 నాటౌట్) నిలిచారు. చివరి బంతికి సింగిల్ తీసిన రోయి జట్టుకు విజయం అందించింది. భారత బౌలర్లలో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ రెండేసి వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment