హామిల్టన్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు మధుర జ్ఞాపకంగా మిగులుతుందనుకున్న మ్యాచ్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. 200 వన్డేలు ఆడిన 14వ భారత ఆటగాడిగా ఖ్యాతికెక్కిన అతడికి ‘స్పెషల్ మ్యాచ్’ పీడకలగా మారింది. న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన వన్డే రోహిత్ శర్మకు 200వ మ్యాచ్. ఇది తనకెంతో ప్రత్యేకమైన మ్యాచ్ అని చెప్పిన కొద్ది నిమిషాలకే ఊహించనివిధంగా అతడికి షాక్ తగిలింది.
కోహ్లి స్థానంలో నాయకత్వ బాధ్యతలు కూడా చేపట్టి జట్టును నడిపించిన రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ ఘోర పరాభవాన్ని మిగిల్చింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ దిగిన భారత జట్టు వడివడిగా వికెట్లు చేజార్చుకుంది. 35 పరుగులకే టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో టీమిండియా కోలుకోలేపోయింది. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ పదునైన బంతులకు భారత బ్యాట్స్‌మన్ల దగ్గర సమాధానం లేకపోయింది. స్పెషల్ మ్యాచ్‌లో సత్తా చాటుతాడుకున్న రోహిత్ సహా అందరూ చేవ చూపకపోవడంతో టీమిండియా ఘోర పరాజయాన్ని నమోదు చేసింది. 23 బంతులు ఎదుర్కొన్న రోహిత్ కేవలం 7 పరుగులే చేసి నిరాశపరిచాడు. తర్వాత అందరూ అతడి దారిలోనే పయనించారు.
వరుసగా మూడు వన్డేల్లో కివీస్‌ను చిత్తు చేసిన జట్టు కేవలం ఇద్దరు ఆటగాళ్లు లేకపోవడం వల్ల ఇంత పేలవ ప్రదర్శన చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్రీడా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తాను ఈ స్థాయికి వచ్చానని మ్యాచ్‌కు ముందు రోహిత్ చెప్పాడు. ఆటలోనూ గెలుపోటములు సహజమే కానీ ఇంత దారుణంగా ఓడిపోవడమే టీమిండియా అభిమానులకు మింగుడుపడటం లేదు. చివరి వన్డేలో ఏం చేస్తారో చూడాలి. (చిత్తుగా ఓడిన టీమిండియా)
Comments
Please login to add a commentAdd a comment