
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు జట్టుతో జరుగుతున్న విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్–16 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర బ్యాట్స్‌మన్ కె. నితీశ్ కుమార్ రెడ్డి (407 బంతుల్లో 301 నాటౌట్; 41 ఫోర్లు, ఒక సిక్స్) అజేయ ట్రిపుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ఎన్‌ఎఫ్‌సీ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ధరణి కుమార్ (101; 14 ఫోర్లు, 1 సిక్స్) కూడా సెంచరీ చేయడంతో ఆంధ్ర భారీస్కోరు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 320/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర 127 ఓవర్లలో 4 వికెట్లకు 509 పరుగుల వద్ద ఇన్నిం గ్స్‌ను డిక్లేర్ చేసింది.
190 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆట ప్రారంభించిన నితీశ్... 318 బంతుల్లో డబుల్ సెంచరీని, 406 బంతుల్లో ట్రిపుల్ సెంచరీని అందుకున్నాడు. ధరణి, నితీశ్ జోడి నాలుగో వికెట్‌కు 229 పరుగుల్ని జోడించింది. తమిళనాడు బౌలర్లు రోజంతా శ్రమించి కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన తమిళనాడు ఆటముగిసే సమయానికి 2 వికెట్లకు 126 పరుగులు చేసింది.