సాక్షి, హైదారాబాద్: అవంతి డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో జరిగిన ఉస్మానియా అంతర్ కళాశాలల క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్‌లో నిజామ్ కాలేజ్, కస్తూర్బా గాంధీ కాలేజ్ జట్లు చాంపియన్లుగా నిలిచాయి. ఆదివారం ఉస్మానియా ప్రాంగణంలో జరిగిన పురుషుల టీమ్ ఈవెంట్ పోటీల్లో 87 పాయింట్లు సాధించి నిజామ్ కాలేజ్ విజేతగా నిలవగా... 153 పాయింట్లతో భవన్స్ వివేకానంద కాలేజ్, 217 పాయింట్లతో బద్రుక కాలేజ్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్ని దక్కించుకున్నాయి. మహిళల టీమ్ ఈవెంట్‌లో కస్తూర్బా గాంధీ కాలేజ్ (38 పాయింట్లు), సెయింట్ ఆన్స్ డిగ్రీ కాలేజ్ (42 పాయింట్లు), కోఠి మహిళల యూనివర్సిటీ కాలేజ్ (54 పాయింట్లు)లు తొలి 3 స్థానాల్లో నిలిచాయి.
మరోవైపు 5 కి.మీ పరుగు మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రియాంక (వనిత మహావిద్యాలయ) 19: 58.7 నిమిషాల్లో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ఆర్. కలైవాణి (20:53 ని., సెయింట్ ఆన్స్), కె. మానస (22:14.3ని.) రన్నరప్‌లుగా నిలిచారు. 12 కి.మీ రేసులో పురుషుల వ్యక్తిగత విభాగంలో కె. ఆనంద్ (41: 39.8ని., న్యూ గవర్నమెంట్ కాలేజ్, శేరిలింగంపల్లి), ఎస్. వినోద్ (42:02.08ని., నిజామ్ కాలేజ్), బి. రంగయ్య (42:07.8ని., న్యూ బద్రుక కాలేజ్) తొలి మూడు స్థానాల్ని దక్కించుకున్నారు.