హిమ దాస్
సాక్షి, హైదరాబాద్ : హిమ దాస్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారు మోగుతున్న పేరు. గత రెండు రోజులుగా ఈ అసోం అమ్మాయిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి.. సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరు ఆమెను ప్రశంసించడానికి పోటీ పడ్డారు. అయితే ఆమె ప్రతిభను కేవలం ప్రశంసలతోనే సరిపెట్టడమే విస్మయానికి గురిచేస్తోంది. గతంలో పతకాలు సాధించిన ఆటగాళ్లకు దక్కిన నజరానా, బహుమతులు కానీ ఈ గ్రామీణ క్రీడాకారిణికి దక్కకపోవడం గమనార్హం. క్రీడలకు అంతంత మాత్రానే ప్రోత్సాహకం లభించే మన దేశంలో విజయాలు సాధిస్తే మాత్రం బహుమతులు, నజరానాలతో పోటీపడటం గతంలో చాలా సందర్భాల్లో చూశాం. అయితే హిమ విషయంలో మాత్రం 2020 టోక్యో ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ఆమె ఖర్చులు భరిస్తామని, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కింద నెలకు రూ. 50 వేలు చొప్పున అందజేస్తామని చెప్పి క్రీడా మంత్రిత్వ శాఖ చేతులు దులుపుకోవడమే ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
అయితే ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన క్రీడాకారిణులకు దేశం ఎంతో ఘనంగా స్వాగతం పలికింది. ఏవేవో కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు వరదలో ముంచెత్తాయి.. ఆకాశానికి ఎత్తాయి.. కార్లు ఇచ్చాయి.. కానుకలిచ్చాయి. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాయి. కానీ చాలా మంది స్పాన్సర్లు, పుష్కలంగా డబ్బులున్న టెన్నిస్, బ్యాడ్మింటన్ స్టార్లకే కాకుండా.. మట్టిలో మాణిక్యమైన హిమ దాస్ వంటి గ్రామీణ క్రీడాకారులకు కూడా సాయం అందిస్తే బాగుంటుందని ప్రతీ సగటు క్రీడా ప్రేమికుడు అభిప్రాయపడుతున్నాడు.
అసలెవరూ ఈ హిమ దాస్
ఫిన్లాండ్‌లోని టాంపెరెలో జరిగిన ఈవెంట్‌లో 400 మీటర్ల పరుగులో 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం నెగ్గారు. ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా హిమ దాస్ రికార్డు సృష్టించింది. అసోంలోని నగావ్ జిల్లా ధింగ్ గ్రామం 18 ఏళ్ల హిమ దాస్ స్వస్థలం. నలుగురు పిల్లల్లో చిన్నది. దేశంలోని ఎందరో మేటి అథ్లెట్ల మాదిరిగానే ఆమెది గ్రామీణ, పేదరిక నేపథ్యం.. వారిలాగే ఆటలంటే ఆమెకు ఎక్కడలేని ఇష్టం.. బురద, మట్టితో కూడిన తన పొలమే ఆమెకు తొలి ‘ట్రాక్’ అయింది.. అక్కడ నిరంతర సాధన ఆమెను శారీరకంగా బలవంతంగా తయారు చేస్తే.. కుటుంబ కష్టాలు, కన్నీళ్లు మానసిక దృఢత్వాన్ని పెంచాయి.. అయితే తొలి అడుగు ఫుట్‌బాల్‌వైపు పడినా పరుగులో ఆమె వేగం చూసిన స్థానిక కోచ్ ఇచ్చిన సలహాతో రన్నింగ్‌కు మారింది.. అలా రెండేళ్లలోనే ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం కొల్లగొట్టే స్థాయికి ఎదిగింది.. దిగ్గజ మిల్కాసింగ్, పీటీ ఉష తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత పతాకంను రెపరెపలాడించిందీ.
Comments
Please login to add a commentAdd a comment