కరాచీ: టెస్టు క్రికెట్‌లో టాస్‌ను తొలగించే అంశంపై ఐసీసీ క్రికెట్ కమిటీ ఆలోచనలు చేస్తోంది. ఆతిథ్య జట్లు పిచ్‌లను తమకు అనుకూలంగా తయారు చేసుకుంటున్న రీత్యా ఈ విధానానికి స్వస్తి పలకాలనే భావిస్తోంది. దీన్ని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ స్వాగతించాడు. టెస్టుల్లో టాస్ లేకుండా ఉండటం వల్ల మంచి పిచ్‌లను రూపొందించడానికి ఆతిథ్య జట్లు కృషి చేస్తాయన్నాడు. దీనివల్ల లాభమే తప్పా నష్టమేమీ లేదని మియాందాద్ అభిప్రాయపడ్డాడు.
‘ఆతిథ్య జట్లు వారికి నచ్చిన తరహాలో పిచ్‌లను తయారు చేస్తున్నాయి. దీనివల్ల చాలా ఎక్కువ సందర్బాల్లో పేలవమైన పిచ్‌లను రూపొందిస్తున్నారు. ఒకవేళ టెస్టుల్లో టాస్ లేకపోతే అప్పుడు ఆతిథ్య మంచి పిచ్‌లను తయారు చేయడానికి వెనుకాడదు. ఈ ప్రయోగం మంచిదే’ అని మియాందాద్ తెలిపాడు.
టెస్టుల్లో టాస్ తొలగించే అంశంపై ఈ నెల 28, 29 తేదీల్లో ముంబైలో జరగనున్న సమావేశంలో కమిటీ చర్చించనుంది. అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, ఆండ్రూ స్ట్రాస్, జయవర్ధనే, టిమ్ మే, న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్, అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో, ఐసీసీ రిఫరీలు రంజన్ మదుగలే, షాన్ పొలాక్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2021లో తలపెట్టిన ప్రతిపాదిత టెస్టు చాంపియన్‌షిప్ నాటికి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లిష్ కౌంటీల్లో మూడు సీజన్లుగా టాస్ లేకుండా... బ్యాటింగ్, బౌలింగ్ ఎంపికను పర్యాటక జట్టుకే వదిలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment