భారత మాజీ ఓపెనర్, డేరింగ్ బ్యాట్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ తన మాటల తూటాలను మరోసారి పేల్చాడు. ఈసారి భారత కెప్టెన్ విరాట్ కోహ్లి లక్ష్యంగా విమర్శలు సంధించాడు. మైదానంలో కోహ్లి చేస్తున్న తప్పులను ఎవరూ వేలెత్తి చూపించడం లేదన్నాడు.
‘ప్రతిజట్టులో నాయకుడు చేస్తున్న పొరపాట్లను చెబుతూ ఉండే ఆటగాళ్లు నలుగురైదుగురు ఉంటారు. కానీ నేను మాత్రం భారత జట్టులో అలాంటి వాళ్లను ఇప్పటివరకూ చూడలేదు. గ్రౌండ్, డ్రెసింగ్ రూమ్‌లో కోహ్లి తీసుకుంటున్న నిర్ణయాలను జట్టులోని ఏ ఒక్క ఆటగాడు వేలెత్తి చూపించడం లేద’ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘విరాట్ మంచి ఆటగాడు. అన్ని పరిస్థితుల్లో రాణించగల నైపుణ్యం ఉన్నవాడు. అయితే తనలాంటి ఆటతీరు జట్టు ఆటగాళ్ల నుంచి ఆశిస్తున్నాడు. అందువల్లే అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే కోహ్లి కెప్టెన్సీకే ప్రమాదమ’ని హెచ్చరించాడు.
ఓ చానెల్‌లో మాట్లాడుతూ ‘కోహ్లి తన లాగే వేగంగా ఇతర ఆటగాళ్ల నుంచి పరుగులు ఆశిస్తున్నాడు. ఇందులో తప్పేం లేదు. గతంలో సచిన్ తన కెప్టెన్సీలో ఇదే విధంగా ఎక్కువ పరుగులు చేయమని అడిగేవాడు. తనలాగ ఎందుకు పరుగులు తీయలేరంటూ ప్రశ్నించేవాడు. డ్రెసింగ్ రూమ్‌లో కోచ్ నుంచి సలహాలు తీసుకుంటున్న కోహ్లి, మైదానంలో మాత్రం వాటిని అమలుపరచడం లేదు. మూడో టెస్టు కోసమైనా అందరూ సమిష్టి కృషి చేయాలి. ఏ ఒక్కరి కష్టంతోనో విజయం రాదు. గెలుపు కోసం టీంవర్క్ చేయాల’ని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment