
న్యూఢిల్లీ:ఆధునిక ప్రపంచ క్రికెట్‌లో బెస్ట్ బ్యాట్స్‌మన్ ఎవరనే దానిపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిని ఎంపిక చేసుకునే క్రమంలో తొమ్మిది మంది క్రికెటర్ల పేర్లను ఉదహరించిన సెహ్వాగ్..చివరకూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి ఓటేశాడు. ఈ మేరకు ఫేస్‌బుక్ వేదికగా ఫ్యాన్స్‌తో వీడియో చాట్‌లో పాల్గొన్న సెహ్వాగ్.. అన్ని ఫార్మాట్ల పరంగా చూస్తే ప్రస్తుత తరుణంలో కోహ్లినే నంబర్ వన్ ఆటగాడని అభిప్రాయపడ్డాడు.
విరాట్ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనడానికి మూడు వేర్వేరు ఫార్మాట్లలో కోహ్లి నమోదు చేసిన యావరేజ్‌ను సెహ్వాగ్ ప్రస్తావించాడు. మూడు ఫార్మాట్లలోనూ విరాట్ 50.00పైగా నమోదు చేసిన సగటే అతన్ని అగ్రస్థానంలో నిలిపిందన్నాడు. తనకు పోటీదారులుగా ఉన్న క్రికెటర్లతో పోలిస్తే అన్ని ఫార్మాట్లలో యాభైకు పైగా యావరేజ్ సాధించిన ఏకైక క్రికెటర్ కోహ్లినేనని సెహ్వాగ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. మరొకవైపు దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో విరాట్ కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయమని వీరూ జోస్యం చెప్పాడు. శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్‌లో సెంచరీలు బాది సూపర్‌ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి.. సఫారీ గడ్డపై కూడా మెరుస్తాడన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment