వాళ్లు తప్పులో కాలేసినట్లే: కోహ్లీ
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫైనల్ చేరిన పాకిస్తాన్, భారత్‌లు పూర్తి స్థాయిలో కసరత్తులు మొదలుపెట్టాయి. అయితే పలానా జట్టు గెలుస్తుందని ముందే భావిస్తే.. వాళ్లు తప్పులో కాలేసినట్లేనని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. తుది సమరంలో అన్ని విభాగాల్లో రాణిస్తే ఏ జట్టుకైనా విజయం సాధ్యమన్నాడు. ఇప్పటివరకూ అత్యుత్తమ క్రికెట్ ఆడామని, ఫైనల్లో అదే ప్రదర్శనను పునరావృతం చేస్తామని ధీమాగా ఉన్నాడు కోహ్లీ.
'ప్రత్యర్ధి పాక్ జట్టు బలం, బలహీనత రెండు తెలుసు. గ్రూపు దశలో వచ్చిన ఫలితాన్ని ఫైనల్లో రాబట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. జట్టులో మార్పులు లేకుండా బరిలోకి దిగాలని భావిస్తున్నాం. బంగ్లాతో మ్యాచ్‌లో సెంచరీ మార్క్ చేరకపోవడంపై ఏ స్టేట్‌మెంట్ ఇవ్వదలుచుకోలేదు. చేసిన పరుగులు జట్టు విజయానికి తోడ్పడితే చాలు. ఫైనల్లో బ్యాటింగ్‌ను అదే విధంగా ఆస్వాదిస్తాను. మా అలాగే మంచి క్రికెట్ ఆడినందుకే పాక్ ఫైనల్ చేరింది. అయితే బిగ్ మ్యాచ్ అని భావిస్తే కెప్టెన్‌గా ఆలోచనలు, గేమ్ ప్లాన్ మారుతుంది. అందుకే భారత్‌కు ట్రోఫీ అందించడమే లక్ష్యంగా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతామని' కెప్టెన్ కోహ్లీ చెబుతున్నాడు.