వ్యూహాల్లో మార్పులు అనవసరం | Changes in strategies are unnecessary | Sakshi
Sakshi News home page

వ్యూహాల్లో మార్పులు అనవసరం

Published Sat, Jun 17 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

వ్యూహాల్లో మార్పులు అనవసరం

వ్యూహాల్లో మార్పులు అనవసరం

పాక్‌తో ఫైనల్‌పై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యాఖ్య

బర్మింగ్‌హామ్‌: చాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభానికి ముందు పాకిస్తాన్‌ విజయావకాశాల గురించి ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు... అయినా అనూహ్య ప్రదర్శనతో వరుసగా మూడు మ్యాచ్‌లను నెగ్గి ఆ జట్టు ఏకంగా తుది పోరుకు అర్హత సాధించగలిగింది. అయితే జోరు మీదున్న పాక్‌ను ఎదుర్కొనేందుకు తమ వ్యూహాల్లో  కొత్తగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తేల్చి చెప్పాడు. సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను సునాయాసంగా ఓడించి భారత్‌.. మరో సెమీస్‌లో ఊపుమీదున్న ఇంగ్లండ్‌ను మట్టికరిపించి పాక్‌ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఇక భారత్, పాక్‌ హై ఓల్టేజి ఫైనల్‌ మ్యాచ్‌ గురించి మాత్రం కోహ్లి చాలా తేలిగ్గానే స్పందించాడు. ‘ఇప్పటిదాకా మేం కొనసాగించిన ఆటనే ఫైనల్లోనూ ప్రదర్శిస్తాం. పాక్‌ బలం, బలహీనతల గురించి మాకు తెలుసు. దానికి తగ్గట్టుగా మా ప్రణాళికలు ఉంటాయి. కానీ మ్యాచ్‌లో భారీ మార్పులు చేసుకోవాల్సిన అవసరం మాత్రం లేదు. సమష్టిగా మా ఆటతీరు అద్భుతంగా ఉంది. ఫైనల్‌ రోజు మా స్థాయికి తగ్గ ఆటను మైదానంలో కనబరిస్తే ఫలితం అదే వస్తుంది. ముందుగానే ఎవరినీ విజేతలుగా అంచనా వేయలేం. ఇప్పటిదాకా కొన్ని ఆశ్చర్యకర ఫలితాలను చూశాం’ అని కోహ్లి తెలిపాడు. అలాగే చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌ ప్రదర్శన ఆకట్టుకుందని కొనియాడాడు. ఓ జట్టు మంచి క్రికెట్‌ ఆడితేనే ఫైనల్‌కు వస్తుందని, పరిస్థితులను వారికి అనుకూలంగా మలుచుకుని అద్భుత ఫలితాలను సాధించారని కొనియాడాడు.

‘ఈ దశలో పరుగుల గురించి ఆలోచించడం లేదు’
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి వన్డేల్లో వేగంగా 8వేల పరుగులను పూర్తి చేసిన విష యం తెలిసిందే. అయితే ఈ దశలో రికార్డుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌ అనంతరం తాను సన్నద్ధమైన తీరు ప్రస్తుత టోర్నీలో ఫలితం చూపిస్తోందని చెప్పాడు. జట్టు పరిస్థితులకు తగ్గట్టుగా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధమేనని చెప్పాడు.

కృత్రిమ పిచ్‌పైనే ఆడించారు..
భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ను కృత్రిమ (మ్యాట్‌) పిచ్‌పైనే ఆడించడం వివాదాస్పదమైంది. సెమీస్‌ అనంతరం ఇక్కడ వార్విక్‌షైర్, లాంకషైర్‌ జట్ల మధ్య కౌంటీ మ్యాచ్‌ ఉండడంతో మ్యాట్‌ను తొలగించేందుకు క్యురేటర్‌ ససేమిరా అన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల కన్నా తమకు కౌంటీ లే ముఖ్యమని ఎడ్జ్‌బాస్టన్‌ పిచ్‌ క్యురేటర్‌ తన చర్య ద్వారా స్పష్టం చేశారు. దీంతో భారత్, బంగ్లా మ్యాచ్‌ను కృత్రిమ పిచ్‌పైనే ఆడించాల్సి వచ్చింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో మైదానం పూర్తిగా ఐసీసీ అదుపులో ఉంటుంది. ఫీల్డర్లు గాయపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పిచ్‌లను అనుమతించరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement