
ఒలింపిక్స్ వరకు ఓల్ట్‌మన్స్
♦ చీఫ్ కోచ్‌గా నియామకం
♦ హాకీ ఇండియా ప్రకటన
న్యూఢిల్లీ : మరోసారి విదేశీ కోచ్‌వైపే మొగ్గుచూపిన హాకీ ఇండియా భారత పురుషుల జట్టుకు రోలంట్ ఓల్ట్‌మన్స్‌ను చీఫ్ కోచ్‌గా నియమించింది. నెదర్లాండ్స్‌కు చెందిన 61 ఏళ్ల ఓల్ట్‌మన్స్ గత మూడేళ్లుగా భారత జట్టుతో కలిసి పని చేస్తున్నారు. ఆయన హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ‘వచ్చే ఏడాది ఆగస్టులో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ క్రీడల వరకు ఓల్ట్‌మన్స్ కోచ్‌గా ఉంటారు. ఈ మేరకు ఆయన తన అంగీకారాన్ని కూడా తెలిపారు. ఒలింపిక్స్ తర్వాత కూడా ఆయనే కోచ్‌గా ఉండాలని మేము కోరుకుంటున్నాం’ అని హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపారు.
భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) డెరైక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాస్‌తో శనివారం సమావేశం అయ్యాక బాత్రా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఓల్ట్‌మన్స్ నియామకంతో గత ఐదు నెలలుగా చీఫ్ కోచ్‌గా ఉన్న పాల్ వాన్ యాస్‌ను ఆ పదవి నుంచి అధికారికంగా తొలగించినట్లయింది. ‘పాల్ వాన్ యాస్‌పై వేటు అంశం ముగిసిన అధ్యాయం. కోచ్‌లు వస్తుంటారు, పోతుంటారు. ముఖ్యమైన విషయమేమిటంటే భారత హాకీ ముందుకు వెళ్లాలి. ఓల్ట్‌మన్స్‌కు ఏమేమీ కావాలో ఆయనను అడిగి సమకూర్చుతాం’ అని నరీందర్ బాత్రా తెలిపారు. 2013లో నాటి చీఫ్ కోచ్ మైకేల్ నాబ్స్ (ఆస్ట్రేలియా)పై వేటు పడిన తర్వాత రోలంట్ ఓల్ట్‌మన్స్ ఆసియా కప్, చాంపియన్స్ ట్రోఫీలలో భారత జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించారు.