సాక్షి, సిటీబ్యూరో: ఆ పోటీకి ఎంట్రీ ఫీజు లేదు. అలాగని అందరూ పాల్గొనేద్దాం అంటే కుదరదు. ప్రస్తుతం దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి గాను నిధుల సేకరణ నిమిత్తం ఏర్పాటైన పీఎం కేర్స్‌కు తప్పనిసరిగా విరాళం ఇవ్వాల్సిందే. విరాళమే పోటీలో పాల్గొనేందుకు అర్హతగా పలువురు టీనేజీ ఔత్సాహిక చదరంగం క్రీడాకారులను ఆకట్టుకున్న ఈ ఆన్‌లైన్ టోర్నమెంట్‌లో 80 మంది పాల్గొనగా కేపీహెచ్‌బీ నివాసి రవితేజ గెలుపొందారు. కొంత కాలంగా చెస్ పోటీల్లో రాణిస్తున్న రైల్వే ఉద్యోగి రవితేజ పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే...
ఎన్ని పోటీల్లో గెలిచినా...లాక్ డౌన్ టైమ్‌లో గెలవడం, అది కూడా ఒక మంచి పనిలో భాగం కావడం ఆనందంగా ఉంది నాకు ఈ పోటీలో వచ్చిన ప్రైజ్ మనీ కూడా నేను పీఎంకేర్స్ ఫండ్‌కే అందజేశా. ప్రధాన మంత్రి ఆధ్వర్యంలో కరోనా నివారణ కోసం ఏర్పాటైన పిఎమ్ కేర్స్ ఫండ్‌కు తమ వంతుగా ఏదైనా చేయాలని ఆలోచించిన యువ చెస్ క్రీడాకారులు ముంబయికి చెందిన అండర్ 17 చెస్ ఛాంపియన్ వేదాంత్ పనేశర్ , అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు. ఆదర్శ్ త్రిపాఠి (14), యష్ శ్రీవాస్తవ (17)లు గత 7వ తేదీన ఈ ఆన్‌లైన్ టోర్నమెంట్‌ను దాదాపు 2గంటల పాటు నిర్వహించారు. వీరు ఏర్పాటు చేసిన ది చెస్టర్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలో పాల్గొనేందుకు ఎటువంటి ఫీజూ వసూలు చేయకుండా వారిని నేరుగా పీఎమ్ కేర్స్ ఫండ్‌కు విరాళం ఇవ్వమన్నారు. అలా అందించిన తర్వాత దానిని స్క్రీన్ షాట్ తీసి పోటీ నిర్వాహకులకు పంపిన తర్వాతే పోటీలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ముంబయ్, నాగ్‌పూర్, నోయిడా నగరాలతో పాటు మన హైదరాబాద్ నుంచి కూడా ఇందులో పలువురు పాల్గొన్నారు. క్రీడాకారులు ఫీజు రూపంలో రూ.1.05లక్షలు నేరుగా పిఎం కేర్స్ ఫండ్‌లో జమచేశారు. ఈ టోర్నమెంట్లో కేటగిరీల వారీగా గెలుపొందిన 20 మందికి బహుమతులు కూడా నిర్వాహకులు సొంత ఖర్చులతో అందించారు.
Comments
Please login to add a commentAdd a comment