
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఇంటర్ జోనల్ టెన్నిస్ టోర్నీలో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. కర్ణాటకలోని మణిపాల్ యూనివర్సిటీలో జరిగిన ఈ టోర్నీలో 16 యూనివర్సిటీ జట్లు టైటిల్ కోసం తలపడగా గుజరాత్ జట్టు విజేతగా నిలిచింది. శ్రావ్య శివాని, శ్రియ, సాయిదేదీప్య, అనూష కొండవీటి సభ్యులుగా ఉన్న ఉస్మానియా జట్టు ఫైనల్లో 1–2తో గుజరాత్ యూనివర్సిటీ చేతిలో ఓటమి పాలైంది.
తొలి సింగిల్స్‌లో శ్రావ్య శివాని (ఓయూ) 6–7, 4–6తో వైదేహి (గుజరాత్ యూనివర్సిటీ) చేతిలో ఓడిపోయింది. రెండో సింగిల్స్‌లో టి.శ్రియ (ఓయూ) 6–2, 6–1తో రుత్వి (గుజరాత్)పై గెలుపొందడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో శ్రావ్య శివాని–శ్రియ (ఓయూ) ద్వయం 4–6, 4–6తో వైదేహి–రుత్వి (గుజరాత్) జోడీ చేతిలో ఓడటంతో ఓయూ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో ఓయూ 2–0తో పంజాబ్ యూనివర్సిటీపై, క్వార్టర్స్‌లో 2–0తో ఢిల్లీ యూనివర్సిటీ జట్టుపై విజయం సాధించింది.