న్యూఢిల్లీ: భారత టాప్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పూసర్ల వెంకట (పీవీ) సింధు స్పాన్సర్‌షిప్ ప్రపంచంలో పెద్ద ఘనతను నమోదు చేసింది. చైనాకు చెందిన క్రీడా ఉపకరణాల సంస్థ ‘లి నింగ్’ నాలుగేళ్ల కాలానికి సింధుతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం సింధుకు లి నింగ్ రూ. 50 కోట్లు చెల్లిస్తుంది. ఇందులో రూ.40 కోట్లు స్పాన్సర్‌షిప్ మొత్తంగా... మరో రూ.10 కోట్లు బ్యాడ్మింటన్ క్రీడా సామగ్రి రూపంలో ఆమెకు అందజేస్తుందని సమాచారం.
ఒప్పందం ప్రకారం ఇకపై సింధు లి నింగ్‌కు చెందిన క్రీడా ఉత్పత్తులనే వాడాల్సి ఉంటుంది. ఇటీవలే పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్‌తో రూ. 35 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్న ఆ కంపెనీ ఇప్పుడు సింధుతో జత కట్టడం విశేషం. గతంలో 2014–15లో రెండేళ్ల పాటు సింధుకు స్పాన్సర్‌షిప్ అందించిన లి నింగ్ అప్పట్లో ఏడాదికి కోటిన్నర చొప్పున చెల్లించింది. గత మూడేళ్లుగా యోనెక్స్ కంపెనీతో అనుబంధం కొనసాగిస్తున్న సింధు ఏడాదికి రూ. 3.5 కోట్ల చొప్పున అందుకుంటోంది.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఇది అతి పెద్ద ఒప్పందమని, ‘పూమా’తో విరాట్ కోహ్లి కుదుర్చుకున్న ఒప్పందంతో దాదాపుగా సమానమని లి నింగ్ ప్రతినిధి మహేంద్ర కపూర్ వెల్లడించారు. ఏడాదికి రూ.12.5 కోట్ల చొప్పున ‘పూమా’ ఎనిమిదేళ్ల కాలానికి కోహ్లికి రూ. 100 కోట్లు చెల్లించనుంది. మరోవైపు ఇతర భారత షట్లర్లు పారుపల్లి కశ్యప్ (రెండేళ్లకు రూ. 8 కోట్లు), మను అత్రి, సుమీత్ రెడ్డి (రెండేళ్లకు చెరో రూ. 4 కోట్ల చొప్పున)లతో కూడా లి నింగ్ ఒప్పందం కుదుర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment