Li Ning
-
Indian Olympic Association: మాకొద్దీ చైనా దుస్తులు!
న్యూఢిల్లీ: గత గురువారం... టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత ఆటగాళ్లు ధరించే కిట్లను కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాద్రా లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కిట్లను చైనాకు చెందిన ‘లీ నింగ్’ కంపెనీ స్పాన్సర్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో పలువురు ఆటగాళ్లు పాల్గొని ఆ కిట్‌లో పోజులు ఇచ్చారు. అయితే వారం తిరక్క ముందే కథ మారింది. అంతర్గతంగా ఏం జరిగిందో గానీ అనూహ్యంగా ‘సెంటిమెంట్’ ముం దు కు వచ్చింది. చైనా కంపెనీ తయారు చేసిన దుస్తులతో తమ ఆటగాళ్లు ఒలింపిక్స్ బరిలోకి దిగరని, ‘లీ నింగ్’తో ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు ఐఓఏ బుధవారం ప్రకటించింది. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా వెల్లడించారు. ‘మేం కిట్‌ను ఆవిష్కరించిన తర్వాత అన్ని వర్గాలనుంచి విమర్శలు వచ్చాయి. ప్రజల సెంటిమెంట్ కోణంలోనే ఆ కంపెనీని పక్కన పెట్టాలని భావించాం. అభిమానుల భావోద్వేగాలు కూడా ముఖ్యం కదా’ అని ఆయన అన్నారు. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో మన ఆటగాళ్లు ఏ అపెరల్ కంపెనీ లోగో కూడా లేని దుస్తులతో బరిలోకి దిగుతారని ముందుగా ప్రకటించిన బాత్రా... ఈ నెలాఖరులోగా మరో కొత్త స్పాన్సర్ కోసం వెతుకుతామని చెప్పడం విశేషం. -
నాలుగేళ్లకు రూ. 50 కోట్లు!
న్యూఢిల్లీ: భారత టాప్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పూసర్ల వెంకట (పీవీ) సింధు స్పాన్సర్షిప్ ప్రపంచంలో పెద్ద ఘనతను నమోదు చేసింది. చైనాకు చెందిన క్రీడా ఉపకరణాల సంస్థ ‘లి నింగ్’ నాలుగేళ్ల కాలానికి సింధుతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం సింధుకు లి నింగ్ రూ. 50 కోట్లు చెల్లిస్తుంది. ఇందులో రూ.40 కోట్లు స్పాన్సర్షిప్ మొత్తంగా... మరో రూ.10 కోట్లు బ్యాడ్మింటన్ క్రీడా సామగ్రి రూపంలో ఆమెకు అందజేస్తుందని సమాచారం. ఒప్పందం ప్రకారం ఇకపై సింధు లి నింగ్‌కు చెందిన క్రీడా ఉత్పత్తులనే వాడాల్సి ఉంటుంది. ఇటీవలే పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్‌తో రూ. 35 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్న ఆ కంపెనీ ఇప్పుడు సింధుతో జత కట్టడం విశేషం. గతంలో 2014–15లో రెండేళ్ల పాటు సింధుకు స్పాన్సర్షిప్ అందించిన లి నింగ్ అప్పట్లో ఏడాదికి కోటిన్నర చొప్పున చెల్లించింది. గత మూడేళ్లుగా యోనెక్స్ కంపెనీతో అనుబంధం కొనసాగిస్తున్న సింధు ఏడాదికి రూ. 3.5 కోట్ల చొప్పున అందుకుంటోంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఇది అతి పెద్ద ఒప్పందమని, ‘పూమా’తో విరాట్ కోహ్లి కుదుర్చుకున్న ఒప్పందంతో దాదాపుగా సమానమని లి నింగ్ ప్రతినిధి మహేంద్ర కపూర్ వెల్లడించారు. ఏడాదికి రూ.12.5 కోట్ల చొప్పున ‘పూమా’ ఎనిమిదేళ్ల కాలానికి కోహ్లికి రూ. 100 కోట్లు చెల్లించనుంది. మరోవైపు ఇతర భారత షట్లర్లు పారుపల్లి కశ్యప్ (రెండేళ్లకు రూ. 8 కోట్లు), మను అత్రి, సుమీత్ రెడ్డి (రెండేళ్లకు చెరో రూ. 4 కోట్ల చొప్పున)లతో కూడా లి నింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. -
సింధుకు జాక్‌పాట్
న్యూఢిల్లీ: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు జాక్‌పాట్ కొట్టింది. చైనాకు చెందిన ప్రముఖ క్రీడా పరికరా ల తయారీ సంస్థ లీ నింగ్‌తో నాలుగేళ్ల కాలానికి ప్రచారకర్తగా రూ.50కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందు లో రూ.40కోట్లు స్పాన్సర్షిప్కు కాగా, మిగిలిన సొమ్ము సింధుకు అవసరమైన క్రీడాసౌకర్యాల కోసం ఇస్తారు. కాగా, గత నెలలో మరో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌తో సైతం ఇదే కంపెనీ రూ.35 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సింధుకు ఇవ్వజూపిన సొమ్ము ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలోనే భారీ మొత్తంగా భారత్‌లో లీ నింగ్ సంస్థకు భాగస్వామి, సన్‌లైట్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మహేంద్ర కపూర్ తెలిపాడు. ఇది ప్యూమా సంస్థతో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లీ (ఎనిమిదేళ్ల కాలానికి రూ.100కోట్లు) చేసుకున్న ఒప్పందానికి ఇంచుమించు సమాన మొత్తమని పేర్కొన్నాడు. లీనింగ్‌తో సింధు ఒప్పందం కుదుర్చుకోవడం ఇది రెండోసారి. -
శ్రీకాంత్ జాక్‌పాట్
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ బ్రాండింగ్ ప్రపంచంలో బ్రహ్మాండంగా మెరిశాడు. క్రికెటేతర ఆటగాళ్లలో రికార్డు మొత్తానికి భారీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. చైనా స్పోర్ట్స్ బ్రాండ్ ‘లి–నింగ్’ నాలుగేళ్ల కాలానికి శ్రీకాంత్‌తో రూ.35 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. ఇందులో రూ. 30 కోట్లు స్పాన్సర్షిప్ మొత్తంగా అందించనుండగా... మరో రూ. 5 కోట్ల విలువైన క్రీడా సామగ్రిని లి–నింగ్ అందిస్తుంది. 2023 వరకు ఈ ఒప్పందం కొనసాగుతుందని శ్రీకాంత్ వ్యవహారాలు చూసే బేస్‌లైన్ వెంచర్స్ సంస్థ వెల్లడించింది. ఒప్పంద కాలంలో భారత షట్లర్ ఆ సంస్థకు చెందిన క్రీడోపకరణాలే వాడటంతో పాటు మ్యాచ్‌లు ఆడేటపుడు కూడా లి–నింగ్ దుస్తులే ధరించాల్సి ఉంటుంది. కెరీర్లో ఆరు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన శ్రీకాంత్ గత ఏడాది వరల్డ్ నంబర్‌వన్‌గా కూడా నిలిచాడు. ప్రస్తుతం అతను ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు. గతంలో రెండేళ్ల పాటు (2014–15) శ్రీకాంత్ లి–నింగ్‌కు ప్రచారకర్తగా ఉన్నాడు. అయితే ఆ తర్వాత అతను ప్రముఖ జపాన్ సంస్థ ‘యోనెక్స్’తో జత కలిశాడు. చైనాకు చెందిన లి–నింగ్ సంస్థ తమ దేశంతో పాటు ఇండోనేసియా, సింగపూర్, ఆస్ట్రేలియా బ్యాడ్మింటన్ టీమ్‌లకు కిట్లను అందిస్తోంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత బృందానికి స్పాన్సర్‌గా వ్యవహరించిన లి–నింగ్... 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు కూడా భారత జట్టుతో ఒప్పందం కొనసాగించనుంది. -
మరిన్ని విజయాలు సాధిస్తా
సాక్షి, హైదరాబాద్: చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టైటిల్ గెలుచుకోవడం తన కెరీర్లో చిరస్మరణీయమని భారత బ్యాడ్మింటన్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని అతను అన్నాడు. శ్రీకాంత్ స్పాన్సర్ ‘లీ నింగ్’ బుధవారం నగరంలో అతనికి ప్రత్యేక అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసింది. 10 వేల డాలర్లు (దాదాపు రూ. 6 లక్షల 18 వేలు) నగదు బహుమతిని అందజేసింది. ఈ కార్యక్రమంలో భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో పాటు లీ నింగ్ సంస్థ ప్రతినిధి మహేంద్ర కపూర్, ‘గో స్పోర్ట్స్ ఫౌండేషన్’ ప్రోగ్రామ్ డెరైక్టర్ సాయి సుధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ అభిప్రాయాలు అతని మాటల్లోనే.... సహజంగానే లిన్ డాన్‌ను ఓడించడం అంత సులభం కాదని అందరికీ తెలుసు. టోర్నీలోని ఇతర మ్యాచ్‌లలాగే ఫైనల్ కూడా ఆడాను. ఎప్పటిలాగే విజయం కోసం వంద శాతం శ్రమించా. ఆ విజయం దక్కడం చాలా గొప్ప అనుభూతి. వచ్చే నెలలో దుబాయ్‌లో జరగనున్న సీజన్ ముగింపు టోర్నమెంట్ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’లో కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాను. ప్రపంచంలోని టాప్-8 షట్లర్లు అందులో పాల్గొంటారు. ఓడినా నేను పెద్దగా కోల్పోయేదేమీ ఉండదు. కాబట్టి గెలుపు కోసం గట్టిగా పోరాడతాను. నా సీనియర్లు కశ్యప్, గురుసాయిదత్ ఇప్పటికే తామేంటో రుజువు చేసుకున్నారు. భారత్ నుంచి భవిష్యత్తులో పురుషుల సింగిల్స్‌లో మరింత మంది ఆటగాళ్లు వెలుగులోకి వస్తారు. నేను అనారోగ్యానికి గురైన సమయంలో అకాడమీ సహచరులు, కోచ్‌లు అండగా నిలువడంతో తక్కువ సమయంలోనే కోలుకోగలిగాను. ‘ఈ విజయాల విలువ అమూల్యం. ఎంత మందికి శ్రీకాంత్, సైనా విజయాల గొప్పతనం తెలుసో నేను చెప్పలేను. కానీ చైనాలాంటి చోట రెండుసార్లు మన జాతీయ జెండా ఎగరడం అసాధారణం, అద్భుతం. మనవాళ్లు ఇంతకంటే గొప్ప ఫలితాలు సాధించగలరనే విశ్వాసం అది ఇచ్చింది. నేను కూడా ఇంతగా ఆనంద పడిన క్షణాలు ఎప్పుడున్నాయో నాకే గుర్తు లేదు. కానీ శ్రీకాంత్ నాకు అలాంటి సంతోషాన్ని కలిగించాడు’ - పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్ ‘కెరీర్ ఆరంభంలో శ్రీకాంత్‌కు అండగా నిలిచాం. తొలిసారి శ్రీకాంత్‌ను కెరీర్ లక్ష్యాల గురించి అడిగినప్పుడు లిన్ డాన్‌ను ఓడించడం అన్నాడు. అది ఇప్పుడు నిజమైంది.’ - సాయి సుధ, గో స్పోర్ట్స్ ఫౌండేషన్ ప్రతినిధి ‘మా సంస్థ లీ నింగ్ ఆటగాళ్లు గెలవడం అనే ఆలోచనకన్నా... భారత ఆటగాళ్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సత్తా చాటడమే మాకు అమితానందాన్ని కలిగిస్తుంది.’ - మహేంద్ర కపూర్, లీ నింగ్ ప్రతినిధి