మరిన్ని విజయాలు సాధిస్తా | Kidambi Srikanth returns home to warm welcome | Sakshi
Sakshi News home page

మరిన్ని విజయాలు సాధిస్తా

Published Thu, Nov 27 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

మరిన్ని విజయాలు సాధిస్తా

మరిన్ని విజయాలు సాధిస్తా

సాక్షి, హైదరాబాద్: చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టైటిల్ గెలుచుకోవడం తన కెరీర్‌లో చిరస్మరణీయమని భారత బ్యాడ్మింటన్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని అతను అన్నాడు. శ్రీకాంత్ స్పాన్సర్ ‘లీ నింగ్’ బుధవారం నగరంలో అతనికి ప్రత్యేక అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసింది. 10 వేల డాలర్లు (దాదాపు రూ. 6 లక్షల 18 వేలు) నగదు బహుమతిని అందజేసింది. ఈ కార్యక్రమంలో భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో పాటు లీ నింగ్ సంస్థ ప్రతినిధి మహేంద్ర కపూర్, ‘గో స్పోర్ట్స్ ఫౌండేషన్’ ప్రోగ్రామ్ డెరైక్టర్ సాయి సుధ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ అభిప్రాయాలు అతని మాటల్లోనే....
సహజంగానే లిన్ డాన్‌ను ఓడించడం అంత సులభం కాదని అందరికీ తెలుసు. టోర్నీలోని ఇతర మ్యాచ్‌లలాగే ఫైనల్ కూడా ఆడాను. ఎప్పటిలాగే విజయం కోసం వంద శాతం శ్రమించా. ఆ విజయం దక్కడం చాలా గొప్ప అనుభూతి.

వచ్చే నెలలో దుబాయ్‌లో జరగనున్న సీజన్ ముగింపు టోర్నమెంట్ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’లో కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాను. ప్రపంచంలోని టాప్-8 షట్లర్లు అందులో పాల్గొంటారు. ఓడినా నేను పెద్దగా కోల్పోయేదేమీ ఉండదు. కాబట్టి గెలుపు కోసం గట్టిగా పోరాడతాను.

నా సీనియర్లు కశ్యప్, గురుసాయిదత్ ఇప్పటికే తామేంటో రుజువు చేసుకున్నారు. భారత్ నుంచి భవిష్యత్తులో పురుషుల సింగిల్స్‌లో మరింత మంది ఆటగాళ్లు వెలుగులోకి వస్తారు. నేను అనారోగ్యానికి గురైన సమయంలో అకాడమీ సహచరులు, కోచ్‌లు అండగా నిలువడంతో తక్కువ సమయంలోనే కోలుకోగలిగాను.
 
‘ఈ విజయాల విలువ అమూల్యం. ఎంత మందికి శ్రీకాంత్, సైనా విజయాల గొప్పతనం తెలుసో నేను చెప్పలేను. కానీ చైనాలాంటి చోట రెండుసార్లు మన జాతీయ జెండా ఎగరడం అసాధారణం, అద్భుతం. మనవాళ్లు ఇంతకంటే గొప్ప ఫలితాలు సాధించగలరనే విశ్వాసం అది ఇచ్చింది. నేను కూడా ఇంతగా ఆనంద పడిన క్షణాలు ఎప్పుడున్నాయో నాకే గుర్తు లేదు. కానీ శ్రీకాంత్ నాకు అలాంటి సంతోషాన్ని కలిగించాడు’
     - పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్
 
 ‘కెరీర్ ఆరంభంలో శ్రీకాంత్‌కు అండగా నిలిచాం. తొలిసారి శ్రీకాంత్‌ను కెరీర్ లక్ష్యాల గురించి అడిగినప్పుడు లిన్ డాన్‌ను ఓడించడం అన్నాడు. అది ఇప్పుడు నిజమైంది.’    
 - సాయి సుధ, గో స్పోర్ట్స్ ఫౌండేషన్ ప్రతినిధి
 
 ‘మా సంస్థ లీ నింగ్ ఆటగాళ్లు గెలవడం అనే ఆలోచనకన్నా... భారత ఆటగాళ్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సత్తా చాటడమే మాకు అమితానందాన్ని కలిగిస్తుంది.’    
 - మహేంద్ర కపూర్, లీ నింగ్ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement