బోణీ కొట్టిన పాక్.. మిల్లర్ పోరాటం వృథా
బర్మింగ్ హామ్: దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ లో వర్షం తీవ్ర అంతరాయం కలిగిందచింది. దీంతో ఆడిన ఓవర్లు, పరుగులను లెక్కలోకి తీసుకుని డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో అంపైర్లు పాక్‌ను విజేతగా ప్రకటించారు. భారత్ చేతిలో ఓటమితో ట్రోఫీ ప్రారంభించిన పాక్‌కు తొలి విజయం దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగులకే పాక్ బౌలర్లు కట్టడి చేశారు. లక్ష్య ఛేదనకు దిగిన పాక్ ఇన్నింగ్స్ మధ్యలోనే వరుణుడు మ్యాచ్‌ను అడ్డుకున్నాడు. మ్యాచ్ నిలిపివేసే సమయానికి పాక్ 27 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. తిరిగి మ్యాచ్ ప్రారంభించే అవకాశం లేకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పాక్ ఆడిన ఓవర్లలో మెరుగైన రన్ రేట్ ప్రకారం దక్షిణాఫ్రికాపై 19 పరుగుల తేడాతో నెగ్గింది.
పాక్ ఓపెనర్లు అజహర్ అలీ (9), ఫకార్ జమాన్ (31)లతో పాటు మహ్మద్ హఫీజ్ (26)లు ఔట్ కాగా.. బాబర్ అజామ్ (31 బ్యాటింగ్), షోయబ్ మాలిక్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సఫారీ బౌలర్ మోర్ని మోర్కెల్ ఈ మూడు వికెట్లు తీశాడు. ఓపెనర్లు ఒకే ఓవర్లు ఔటయ్యాక బాబర్ అజామ్‌తో కలిసి మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించిన తర్వాత హఫీజ్‌ను కూడా మోర్కెల్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. ఓపెనర్ జమాన్, షోయబ్ మాలిక్ వేగంగా ఆడకపోతే డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పాక్ కు గట్టి దెబ్బ తగిలేది.
మిల్లర్ పోరాటం వృథా
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వీరుడు హసన్ అలీ (3/24), ఇమాద్ వసీమ్ (2/20), జునైద్ ఖాన్ (2/53)ల ధాటికి సఫారీ జట్టు ఓ దశలో 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (33) పరవాలేదనిపించగా, హషీం ఆమ్లా (16), డివిలియర్స్ (0), డుమిని (8) విఫలమయ్యారు. జట్టును ఆదుకునే ప్రయత్నంలో డుప్లెసిస్ (26) ఔటయ్యాడు. హాఫ్ సెంచరీ వీరుడు డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్; 104 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) క్రిస్ మోరిస్ (28), రబాడ (26)లతో కలిసి పోరాటం చేయడంతో దక్షిణాఫ్రికా 200 పైచిలుకు స్కోరు చేయగలిగింది. మొదట పాక్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్, ఆపై బ్యాట్స్‌మెన్ మెరుగైన రన్‌రేట్ తో పరుగులు చేయడం వల్ల డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 19 పరుగుల తేడాతో విజయం సాధించి పాక్ బోణీ కొట్టింది.