తలొగ్గిన పాక్ క్రికెటర్.. భారత్‌పై ప్రశంసలు
లండన్: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పై, టీమిండియాపై తాను చేసిన ట్వీట్లు, కామెంట్లకు గానూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ క్షమాపణ చెప్పాడు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనపై తీవ్ర విమర్శలు రావడంతో యూ టర్స్ తీసుకున్నాడు. సెహ్వాగ్‌పై, కెప్టెన్ కోహ్లీపై ప్రశంసల జల్లులు కురిపించాడు లతీఫ్. దీంతో డాషింగ్ బ్యాట్స్‌మెన్ నైతిక విజయాన్ని సాధించాడు.
టెస్టు క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన గొప్ప బ్యాట్స్‌మన్ సెహ్వాగ్ అని కొనియాడాడు. అయితే ఇతర దేశాలైనా బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలను అగౌరవపరచడం తప్పని పేర్కొంటూనే.. ఈ విషయం గుర్తుంచుకుంటే సెహ్వాగ్ కే మంచిదంటూ వార్నింగ్ ఇచ్చాడు. 'సెమీఫైనల్ చేరుకున్న టీమిండియాకు అభినందనలు. వారికి ఫైనల్ వెళ్లే అవకాశం మెండుగా ఉంది. కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. కానీ అతడు నిజాయితీ పరుడైన కోచ్ అనిల్ కుంబ్లేకు విరుద్ధంగా నడుచుకుంటున్నాడు. కోహ్లీకి నీకు అది తగదని' పాక్ మాజీ క్రికెటర్ లతీఫ్ వీడియో ద్వారా సూచించాడు.
అసలు వివాదమిది..
పాకిస్తాన్‌పై భారత్ 124 పరుగుల తేడాతో నెగ్గిన అనంతరం సెహ్వాగ్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. కంగ్రాట్స్ భారత్.. బాప్ బాప్ హోతా హై అని, బంగ్లాదేశ్‌పై ప్రాక్టీస్ మ్యాచ్‌లో నెగ్గినట్లుగా భారత్ అలవోకగా విజయం సాధించిందని ట్వీట్ చేయడంపై లతీఫ్ తీవ్ర స్థాయిలో స్పందించాడు. సెహ్వాగ్‌ను కించపరిచేలా ట్వీట్లు చేసిన లతీఫ్ అలాగే ఓ వీడియోను పోస్ట్ చేశాడు. లతీఫ్ కామెంట్లపై స్పందించిన సెహ్వాగ్.. 'చెత్త వాగుడు కంటే.. అర్థానిచ్చే నిశ్శబ్ధం మంచిదేనని' ట్వీట్ చేశాడు. మనోజ్ తివారీ కూడా లతీఫ్ పై కామెంట్లతో ఎదురుదాడికి దిగాడు. దీంతో వెనక్కి తగ్గిన లతీఫ్ తన గౌరవాన్ని కాపాడుకునేందుకు భారత ఆటగాళ్లకు క్షమాపణ చెబుతూ, వారి గొప్పతనాన్ని పొగుడుతూ వీడియో పోస్ట్ చేశాడు.