వహ్వా... పాకిస్తాన్‌ | Pakistan wins aganist Srilanka | Sakshi
Sakshi News home page

వహ్వా... పాకిస్తాన్‌

Published Tue, Jun 13 2017 12:04 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

వహ్వా... పాకిస్తాన్‌ - Sakshi

వహ్వా... పాకిస్తాన్‌

సర్ఫరాజ్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌
శ్రీలంకపై అద్భుత విజయం
సెమీస్‌లోకి ప్రవేశం
చాంపియన్స్‌ ట్రోఫీ  


కార్డిఫ్‌: 237 పరుగుల స్వల్ప లక్ష్యం... బరిలోకి దిగిన పాకిస్తాన్‌ తన ‘సహజ’ ఆటను చూపించడంతో ఓ దశలో స్కోరు 162/7... ఇక శ్రీలంక గెలుపు ఖాయమే అని అంతా భావించినా కెప్టెన్‌ సర్ఫరాజ్‌ (79 బంతుల్లో 61 నాటౌట్‌; 5 ఫోర్లు), ఆమిర్‌ (43 బంతుల్లో 28 నాటౌట్‌; 1 ఫోర్‌) పట్టువదలని పోరాటం ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. మరోవైపు శ్రీలంక తమ పేలవ ఫీల్డింగ్‌తోనూ పాక్‌ విజయానికి సహకరించిందని చెప్పుకోవచ్చు. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా సోమవారం జరిగిన ఈ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో పాక్‌ 3 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఓపెనర్‌ డిక్‌వెల్లా (86 బంతుల్లో 73; 4 ఫోర్లు), మ్యాథ్యూస్‌ (54 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే రాణించగలిగారు. పేసర్లు జునైద్‌ ఖాన్, హసన్‌ అలీలకు మూడేసి, ఆమిర్, అష్రాఫ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 44.5 ఓవర్లలో 7 వికెట్లకు 237 పరుగులు చేసింది. ఫఖర్‌ జమాన్‌ (36 బంతుల్లో 50; 8 ఫోర్లు, 1 సిక్స్‌), అజహర్‌ అలీ (50 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

పేస్‌తో కొట్టారు...
నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంకను వణికించింది. నాలుగో ఓవర్‌లో మూడు ఫోర్లు ఇచ్చిన జునైద్‌ ఖాన్‌ తన మరుసటి ఓవర్‌లో ఫామ్‌లో ఉన్న గుణతిలక (13)ను అవుట్‌ చేసి తొలి దెబ్బ తీశాడు. డిక్‌వెల్లాతో కలిసి కుదురుకుంటున్న దశలో మెండిస్‌ (29 బంతుల్లో 27; 4 ఫోర్లు), చండిమాల్‌ (0) వరుస ఓవర్లలో వెనుదిరగడంతో జట్టు 83 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మ్యాథ్యూస్‌తో కలిసి డిక్‌వెల్లా ఇన్నింగ్స్‌ నిర్మించాడు. వీరిద్దరూ ఓపిగ్గా ఆడుతూ స్కోరును పెంచి పాక్‌పై ఒత్తిడి పెంచారు. 52 బంతుల్లో డిక్‌వెల్లా అర్ధ సెంచరీ చేశాడు. అయితే నాలుగో వికెట్‌కు 78 పరుగులు చేరిన కీలక దశలో లంకకు గట్టి షాక్‌ తగిలింది. ఆమిర్‌ తన వరుస ఓవర్లలో మ్యాథ్యూస్, డిక్‌వెల్లాను అవుట్‌ చేయగా... డి సిల్వ (1), పెరీరా (1)ను జునైద్‌ ఖాన్‌ కూడా అలాగే పెవిలియన్‌కు పంపాడు. దీంతో 3.2 ఓవర్ల వ్యవధిలో కేవలం 6 పరుగులకే లంక 4 వికెట్లు కోల్పోయింది. లోయర్‌ ఆర్డర్‌లో గుణరత్నే (44 బంతుల్లో 27; 1 ఫోర్‌), లక్మల్‌ (34 బంతుల్లో 26; 3 ఫోర్లు) పోరాటం ఫలితంగా జట్టు 200 పరుగులైనా దాటగలిగింది.

ఫఖర్, సర్ఫరాజ్‌ అదుర్స్‌...
స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన పాక్‌కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ క్రీజులో ఉన్నంతసేపు బ్యాట్‌ను ఝుళిపించాడు. మూడో ఓవర్‌లో మూడు ఫోర్లు బాది జోరును ప్రదర్శించిన తను 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. అయితే మరుసటి ఓవర్‌లోనే అవుట్‌ కావడంతో తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఒక్కసారిగా లంక బౌలర్లు పట్టు బిగించడంతో మిడిలార్డర్‌ పూర్తిగా తడబడింది. నిలకడగా ఆడుతున్న అజహర్‌ కూడా 20వ ఓవర్‌లో అవుట్‌ కావడంతో జట్టు మరింతగా ఇబ్బంది పడింది. ఓవైపు కెప్టెన్‌ సర్ఫరాజ్‌ క్రీజులో నిలిచినా అవతలివైపు టపటపావికెట్లు నేలకూలాయి. అయితే చివరల్లో ఆమిర్‌ తమ కెప్టెన్‌కు అండగా నిలిచాడు. చక్కటి అవగాహనతో వీరు లంక బౌలర్లపై పైచేయి సాధించారు. దీనికి తోడు మలింగ వరుస ఓవర్లలో సర్ఫరాజ్‌ ఇచ్చిన రెండు క్యాచ్‌లను పెరీరా, సీకుగే వదిలేయడం లంక విజయాన్ని దూరం చేసింది. ఎనిమిదో వికెట్‌కు ఈ జోడి అజేయంగా 75  పరుగులను జోడించింది.

స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్‌: డిక్‌వెలా (సి) సర్ఫరాజ్‌ (బి) ఆమిర్‌ 73; గుణతిలక (సి) మాలిక్‌ (బి) జునైద్‌ 13; మెండిస్‌ (బి) హసన్‌ అలీ 27; చండీమల్‌ (బి) అష్రఫ్‌ 0; మ్యాథ్యూస్‌ (బి) ఆమిర్‌ 39; డి సిల్వా (సి) సర్ఫరాజ్‌ (బి) జునైద్‌ 1; గుణరత్నే (సి) ఫఖర్‌ (బి) హసన్‌ అలీ 27; తిసారా పెరీరా (సి) బాబర్‌ ఆజం (బి) జునైద్‌ 1; లక్మల్‌ (బి) హసన్‌ అలీ 26; మలింగ నాటౌట్‌ 9; ప్రదీప్‌ (సి అండ్‌ బి) అష్రఫ్‌ 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్‌) 236.

వికెట్ల పతనం: 1–26, 2–82, 3–83, 4–161, 5–162, 6–162, 7–167, 8–213, 9–232, 10–236. బౌలింగ్‌: ఆమిర్‌ 10–0–53–2, జునైద్‌ 10–3–40–3, ఇమాద్‌ వసీం 8–1–33–0, అష్రఫ్‌ 6.2–0–37–2, హసన్‌ అలీ 10–0–43–3, హఫీజ్‌ 5–0–24–0.

పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: అజహర్‌ అలీ (సి) మెండిస్‌ (బి) లక్మల్‌ 34; ఫఖర్‌ (సి) గుణరత్నే (బి) ప్రదీప్‌ 50; బాబర్‌ ఆజం (సి) డిసిల్వా (బి) ప్రదీప్‌ 10; హఫీజ్‌ (సి) ప్రదీప్‌ (బి) పెరీరా 1; మాలిక్‌ (సి) డిక్‌వెలా (బి) మలింగ 11; సర్ఫరాజ్‌ నాటౌట్‌ 61; ఇమాద్‌ వసీం (సి) డిక్‌వెలా (బి) ప్రదీప్‌ 4; ఫహీమ్‌ అష్రఫ్‌ రనౌట్‌ 15; ఆమిర్‌ నాటౌట్‌ 28; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (44.5 ఓవర్లలో 7 వికెట్లకు) 237.

వికెట్ల పతనం: 1–74, 2–92, 3–95, 4–110, 5–131, 6–137, 7–162. బౌలింగ్‌: మలింగ 9.5–2–52–1, లక్మల్‌ 10–0–48–1, ప్రదీప్‌ 10–0–60– 3, తిసారా పెరీరా 8–0–43–1, గుణరత్నే 5–0–19 –0, గుణతిలక 1–0–2–0, డి సిల్వా 1–0–3–0.  

సెమీఫైనల్‌ షెడ్యూల్‌
జూన్‌ 14: తొలి సెమీఫైనల్‌
ఇంగ్లండ్‌ గీ పాకిస్తాన్‌
వేదిక: కార్డిఫ్, మ.గం. 3.00 నుంచి


జూన్‌ 15: రెండో సెమీఫైనల్‌
భారత్‌ x బంగ్లాదేశ్‌
వేదిక: బర్మింగ్‌హామ్, మ.గం. 3.00 నుంచి

స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement