సరిగ్గా సంవత్సరం క్రితం వన్డే క్రికెట్‌లో అడుగు పెట్టిన ఫఖర్ జమాన్ తన 17వ మ్యాచ్‌లోనే అద్భుతం చేసి చూపించాడు. గతంలో పాకిస్తాన్ దిగ్గజాలెవరికీ సాధ్యంకాని అరుదైన ఘనతను అందుకొని శిఖరాన నిలిచాడు. 45 ఏళ్ల పాకిస్తాన్ వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచిన జమాన్... 1997 నుంచి సయీద్ అన్వర్ (194) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును అధిగమించాడు. జింబాబ్వే పేలవ బౌలింగ్‌పై చెలరేగిన జమాన్, మరో ఓపెనర్ ఇమామ్–ఉల్–హఖ్ కలిసి తొలి వికెట్‌కు 304 పరుగుల కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పగా, పాక్ వన్డేల్లో తమ అత్యధిక స్కోరు నమోదు చేయడం మరో విశేషం.
బులవాయో: ‘జింబాబ్వేపై పాకిస్తాన్ జట్టు సాధిస్తున్న విజయాలు నాకేమీ సంతృప్తి కలిగించడం లేదు. గెలిచినా అంతా కళావిహీనంగా ఉంది. అత్యద్భుత బౌలింగ్ కానీ 50 బంతుల్లో 100 పరుగులు లాంటి ప్రదర్శనలు కనిపించడం లేదు. ఒక్కరైనా 200 పరుగులు చేసేందుకు ప్రయత్నించవచ్చు కదా. జింబాబ్వేపై కొట్టలేకపోతే మరెక్కడ కొడతారు’... నాలుగు రోజుల క్రితం పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తన జట్టు గురించి చేసిన వ్యాఖ్యలు ఇవి. జట్టు మొత్తం సంగతేమో కానీ ఓపెనర్ ఫఖర్ జమాన్‌లో మాత్రం ఈ మాటలు స్ఫూర్తి రగిలించాయేమో! ఆకాశమే హద్దుగా చెలరేగిన అతను పాక్ తరఫున తొలి డబుల్ సెంచరీతో సమాధానమిచ్చాడు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో అనేక కొత్త రికార్డులు పాక్ వశమయ్యాయి. ఫఖర్ జమాన్ (156 బంతుల్లో 210 నాటౌట్; 24 ఫోర్లు, 5 సిక్సర్లు) డబుల్ సెంచరీతో సత్తా చాటడంతో శుక్రవారం జింబాబ్వేతో జరిగిన నాలుగో వన్డేలో పాక్ 244 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఇమామ్–ఉల్–హఖ్ (122 బంతుల్లో 113; 8 ఫోర్లు) కూడా శతకంతో చెలరేగగా, చివర్లో ఆసిఫ్ అలీ (22 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో పాక్ 50 ఓవర్లలో వికెట్ నష్టానికి 399 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే 42.4 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ (4/28), ఉస్మాన్ ఖాన్ (2/23) రాణించారు. పరుగుల పరంగా పాకిస్తాన్‌కు ఇది రెండో అతి పెద్ద విజయం. ఇరు జట్ల మధ్య చివరి వన్డే ఆదివారం జరుగనుంది.
జమాన్ ఇన్నింగ్స్ సాగిందిలా...
పాక్ ఇన్నింగ్స్‌లో తొలి 22 బంతుల్లో ఫఖర్‌కు ఒక్క బంతి కూడా ఆడే అవకాశం రాలేదు. అనంతరం కొన్ని చక్కటి బౌండరీలు కొట్టిన అతను 51 బంతుల్లో (7 ఫోర్లతో) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా సాధారణంగానే ఆడిన అతను శతకం మార్క్‌ను అందుకునేందుకు మరో 41 (4 ఫోర్లు, 1 సిక్స్) బంతులు తీసుకున్నాడు. అతని కెరీర్‌లో ఇది మూడో సెంచరీ. ఆ తర్వాత అసలు దూకుడు మొదలైంది. డబుల్ సెంచరీ చేరేందుకు ఫఖర్‌కు 56 బంతులు మాత్రమే అవసరమయ్యాయి. సెంచరీ నుంచి డబుల్ సెంచరీ మధ్యలో 13 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 78 పరుగులు బౌండరీల ద్వారానే రాబట్టాడు. ముజరబాని వేసిన 47వ ఓవర్ ఐదో బంతిని కవర్స్ దిశగా బౌండరీకి తరలించడంతో జమాన్ ద్విశతకం పూర్తయింది.
►మ్యాచ్‌కు ముందు కోచ్ మికీ ఆర్థర్ మనం టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుందాం. ఈసారి డబుల్ సెంచరీ కోసం నువ్వు ప్రయత్నించు అని చెప్పారు. అదే పట్టుదలతో ఆడా. అది నిజం కావడం చాలా సంతోషంగా ఉంది.– ఫఖర్ జమాన్
►6 వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఆరో ఆటగాడు ఫఖర్ జమాన్. ఓవరాల్‌గా ఇది ఎనిమిదో డబుల్ సెంచరీ. రోహిత్ శర్మ ఒక్కడే మూడు సాధించాడు.
►1 వన్డేల్లో ఫఖర్, ఇమామ్ తొలి వికెట్‌కు 304 పరుగులు జత చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 2006లో జయసూర్య–తరంగ కలిసి ఇంగ్లండ్‌పై జోడించిన 286 పరుగుల రికార్డును వీరు బద్దలు కొట్టారు. మొత్తంగా ఏ వికెట్‌కైనా 300కు పైగా పరుగులు జత చేసిన నాలుగో జోడి ఇది.
►1 పాక్ తరఫున ఫఖర్ (210ఏ) అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. 1997లో భారత్‌పై సయీద్ అన్వర్ చేసిన 194 పరుగుల రికార్డును అతను దాటాడు.
►1 పాకిస్తాన్‌కు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. 2010లో బంగ్లాదేశ్‌పై సాధించిన 385 పరుగుల స్కోరును ఆ జట్టు అధిగమించింది.
‘ఫఖర్’గా నిలిచిన సైనికుడు!
కెరీర్‌లో ఆడింది 17 వన్డేలే! అయినా భారత క్రికెట్ అభిమానులు మాత్రం ఫఖర్ జమాన్‌ను అంత తొందరగా మర్చిపోలేరు. సంవత్సరం క్రితం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చెలరేగి కోహ్లి సేన టైటిల్ అవకాశాలు దెబ్బ తీసిన ఆటగాడిగానే మనకు గుర్తుండిపోయాడు. తన కెరీర్ నాలుగో మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థిపై చేసిన సెంచరీ అతడిని ఒక్కసారిగా హీరోను చేసింది. ఎంతగా అంటే అతని స్వస్థలం కట్‌లాంగ్ పట్టణంలో ఒక చౌరస్తాకు పాత పేరు తొలగించి ‘ఫఖర్ జమాన్ చౌక్’గా అధికారికంగా ప్రభుత్వం మార్చేసింది. ఈ ఏడాది కాలంలో అతను తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ‘వన్ మ్యాచ్ వండర్’గా నిలిచిపోకుండా రెగ్యులర్ ఓపెనర్‌గా తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై పాకిస్తాన్ చిత్తుగా ఓడిన వన్డే సిరీస్‌లో ప్రతికూల పరిస్థితుల మధ్య జమాన్ చేసిన రెండు అర్ధ సెంచరీలు అతని ఆటలో ఉన్న నాణ్యతకు అద్దంపట్టాయి. పాక్ దిగ్గజం సయీద్ అన్వర్‌ను అభిమానించే, అతనిలాగే ఎడంచేతి వాటం ఓపెనింగ్ శైలి కలిగిన జమాన్... అదే అన్వర్ రికార్డును బద్దలు కొట్టడాన్ని గొప్పగా భావిస్తున్నాడు. 28 ఏళ్ల ఫఖర్‌ను జట్టు సహచరులు ‘సైనికుడు’ అని పిలుస్తారు. పూర్తి స్థాయిలో క్రికెటర్‌గా మారక ముందు జమాన్ పాకిస్తాన్ నేవీలో ఆరేళ్ల పాటు సెయిలర్‌గా పని చేశాడు. 2007లో ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం బాగా లేకపోవడంతో తప్పనిసరై అతను ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది.
అప్పటికే క్రికెట్‌పై ఆసక్తి ఉన్న ఫఖర్ ప్రతిభను గుర్తించి పాకిస్తాన్ నేవల్ క్రికెట్ అకాడమీ కోచ్ అతడిని తమ జట్టులోకి తీసుకున్నాడు. అక్కడే జమాన్ ఆట మరింత మెరుగు పడింది. వేర్వేరు దేశాల సైనికులకు సంబంధించి వరల్డ్ కప్‌లాంటి ‘ఇంటర్నేషనల్ డిఫెన్స్ క్రికెట్ చాలెంజ్ టోర్నీ’ 2012లో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ క్రికెటర్ తమ జట్టును విజేతగా నిలపడంతో కీలక పాత్ర పోషించాడు. 2013లో నేవీని వదిలి రెగ్యులర్ క్రికెట్ బరిలోకి దిగడంతో ఫఖర్ దశ తిరిగింది. దేశవాళీ క్రికెట్‌లో వరుసగా నాలుగేళ్ల పాటు నిలకడగా రాణించడంతో పాటు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మెరుపు ప్రదర్శన అతనికి జాతీయ టి20 జట్టులో చోటు కల్పించింది. ఆ తర్వాత వన్డేల్లోనూ సత్తా చాటడంతో రెండు ఫార్మాట్‌లలోనూ అతను వెనుదిరిగి చూడాల్సిన పని లేకపోయింది. ఇదే పర్యటనలో ఆస్ట్రేలియాపై టి20 మ్యాచ్‌లో 46 బంతుల్లో చేసిన 91 పరుగులు పొట్టి ఫార్మాట్‌లో కూడా ఫఖర్ ఆట పదును చూపించాయి. ఉర్దూలో ఫఖర్ అనే పదానికి గర్వకారణం అని అర్థం. ఇప్పుడు ఒక్క పాకిస్తాన్‌లోనే కాకుండా క్రికెట్ ప్రపంచం మొత్తంలో కూడా సార్థక నామధేయుడిగా అతను కనిపిస్తున్నాడు.
– సాక్షి క్రీడావిభాగం
Comments
Please login to add a commentAdd a comment