అవార్డుల కోసం అత్యాశ పడొదు
భారత క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ
కోల్‌కతా: ఏ క్రీడాకారుడైనా తమ ప్రదర్శన ద్వారానే గుర్తింపు తెచ్చుకోవాలి కానీ అవార్డుల కోసం అత్యాశ పడకూడదని స్నూకర్ అండ్ బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ అభిప్రాయపడ్డాడు. ‘నేనెన్నటికీ అవార్డులు ఇవ్వాలని బయటికెళ్లి నిరసన వ్యక్తం చేయను. వాటిని సాధించాలి కానీ వెంపర్లాడకూడదు. నేను కూడా దరఖాస్తు చేసుకున్నాను. అయితే నేను అర్హుడిని కాదని ప్రభుత్వం అనుకుంటే నాకేమీ దిగులు లేదు. గుర్తింపును మనం డిమాండ్ చేయకూడదు.
ఇక్కడ మనముంది దేశం తరఫున పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచేందుకు. ఏ ఆటలోనైనా ప్రతిభ చాటుకుంటే ఏదో ఒక రోజు గుర్తింపు దానంతటదే వస్తుంది. అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పద్మ అవార్డు విశ్వసనీయత ఏమీ తగ్గలేదు. కొద్ది మంది బహిరంగంగా తమ ఆక్రోషాన్ని వెల్లడించినంత మాత్రాన వీటి గుర్తింపుకొచ్చిన ప్రమాదమేమీ లేదు. ఇక సైనా ప్రతిఘటనపై కామెంట్ చేయలేను కానీ వ్యక్తిగతంగా నేను అలాంటి చేష్టలకు మాత్రం దిగను’ అని అద్వానీ స్పష్టం చేశాడు.