సెమీస్‌లో కశ్యప్, ప్రణయ్
కాలిఫోర్నియా: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో కశ్యప్ 21–13, 21–16తో భారత్‌కే చెందిన సమీర్ వర్మను ఓడించగా... ప్రణయ్ 10–21, 21–15, 21–18తో కాంటా సునెయామ (జపాన్)పై గెలుపొం దాడు.
ఈ ఏడాది కశ్యప్ తొలిసారి ఓ అంతర్జాతీయ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరడం విశేషం. సెమీఫైనల్స్‌లో తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం)తో ప్రణయ్; క్వాంగ్ హీ హెయో (కొరియా)తో కశ్యప్ తలపడతారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం (భారత్) 21–18, 22–20తో హిరోకి ఒకుముర–ఒనోదెరా (జపాన్) జోడీపై గెలిచి సెమీస్‌కు చేరింది.