దీప్తి శర్మ 6/20
మూడో వన్డే కూడా భారత మహిళలదే శ్రీలంకపై 3-0తో క్లీన్‌స్వీప్
రాంచీ: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు జోరు కొనసాగింది. వరుసగా రెండు విజయాలతో ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న మిథాలీ రాజ్ సేన శుక్రవారం మూడో వన్డేలోనూ గెలిచి ద్వైపాక్షిక పోరును 3-0తో ముగించింది. చివరి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక 38.2 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. సురాంగిక (23) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో ఆఫ్‌స్పిన్నర్ దీప్తి శర్మ 9.2 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టడం విశేషం. కెరీర్‌లో తొలి వన్డే ఆడుతున్న ఆఫ్‌స్పిన్నర్ ప్రీతి బోస్ (8-4-8-2) కట్టుదిట్టమైన బౌలింగ్ గణాంకాలు నమోదు చేసింది. అనంతరం భారత్ 29.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా... వేద కృష్ణమూర్తి (90 బంతుల్లో 61 నాటౌట్; 8 ఫోర్లు), దీప్తి శర్మ (59 బంతుల్లో 28; 5 ఫోర్లు) మూడో వికెట్‌కు 70 పరుగులు జోడించి జట్టు విజయాన్ని ఖాయం చేశారు. దీప్తికే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
నాలుగో స్థానానికి భారత్...
ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ సిరీస్‌లో మూడు విజయాల ద్వారా భారత్‌కు మొత్తం 6 పాయింట్లు లభించాయి. ఫలితంగా పట్టికలో మొత్తం 13 పాయింట్లతో జట్టు ప్రస్తుతం నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటికే 15 మ్యాచ్‌లు ఆడిన భారత్... ఇకపై వెస్టిండీస్‌తో 3, పాకిస్తాన్‌తో 3 వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ చాంపియన్‌షిప్‌లో అన్ని మ్యాచ్‌లు ముగిసిన అనంతరం టాప్-4 టీమ్‌లు 2017లో ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. మొదటి నాలుగు స్థానాల్లో నిలవలేకపోతే... మొత్తం 10 జట్లతో కూడిన క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడాల్సి ఉంటుంది. భారత్‌తో పోలిస్తే విండీస్, పాక్ బలహీన జట్లే కావడంతో మన జట్టుకు ఇంకా అవకాశం ఉంది.