చివరి బంతికి సిక్స్... మ్యాచ్ టై
నాటింగ్ హామ్: శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ 'టై'గా ముగిసింది. రెండు జట్లు సమాన స్కోరు సాధించడంతో ఫలితం తేలలేదు. విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడిన ఈ మ్యాచ్ నాటకీయ ఫక్కీలో డ్రా అయింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. మాథ్యూస్(73), ప్రసన్న(59) అర్ధసెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, విలే, ప్లంకెట్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అలీ ఒక వికెట్ దక్కించుకున్నాడు. 287 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన ఇంగ్లీషు టీమ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది.
30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ చివరి వరకు అద్భుతంగా పోరాడింది. లోయర్ ఆర్డర్ లో ప్లంకెట్ మెరుపు ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను 'టై'గా ముగించాడు. చివరి బంతికి సిక్స్ బాదడంతో మ్యాచ్ డ్రా అయింది. 10వ స్థానంలో బ్యాటింగ్ దిగిన పంక్లెట్ 11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ తో 22 పరుగులు బాదాడు. వోక్స్(95), బట్లర్(92), మోర్గాన్(43) రాణించారు. శ్రీలంక బౌలర్లలో లక్మాల్, మాథ్యూస్, ప్రదీప్ రెండేసి వికెట్లు తీశారు. వోక్స్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు.