పొ‘లార్డ్’ ఇన్నింగ్స్
►ముంబై ఇండియన్స్ సంచలన విజయం
►నాలుగు వికెట్లతో బెంగళూరు ఓటమి
►బద్రీ హ్యాట్రిక్ వృథా
ఆఖరి ఐదు, ఆరు ఓవర్లలో కొన్ని షాట్లు కొట్టడం తప్ప సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటం పొలార్డ్ వల్ల కాదు... గత మ్యాచ్‌లో విఫలమైన తర్వాత విండీస్ క్రికెటర్ గురించి ముంబైకర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్య ఇది. దానికి ఘాటుగానే జవాబిచ్చిన పొలార్డ్ ఇప్పుడు తన బ్యాట్‌తో మైదానం నుంచి కూడా పంచ్ విసిరాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే బ్యాటింగ్‌కు వచ్చి తనదైన శైలిలో చెలరేగిన అతను తన విలువేమిటో చూపించాడు.
143 పరుగుల లక్ష్యఛేదనలో... 7 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి పొలార్డ్, కృనాల్ పాండ్యా మెరుపులతో ముంబై విజయతీరం చేరింది. అభిమానుల అంచనాలను అందుకుంటూ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే కోహ్లి చెలరేగినా, ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో బెంగళూరు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆ తర్వాత బౌలింగ్‌లో సామ్యూల్ బద్రీ ‘హ్యాట్రిక్’తో ఆ జట్టులో ఆశలు రేపాడు. కానీ చిన్నస్వామిలో చివరకు ఫలితం ఆర్‌సీబీకి ప్రతికూలంగానే వచ్చింది.
బెంగళూరు: తొలి మ్యాచ్‌లో పరాజయం తర్వాత ఫామ్‌లోకి వచ్చిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముంబై నాలుగు వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి (47 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం ముంబై 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కీరన్ పొలార్డ్ (47 బం తుల్లో 70; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, కృనాల్ పాండ్యా (30 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఆకట్టుకున్నాడు. బెంగళూరు బౌలర్లలో బద్రీ ‘హ్యా ట్రిక్’ సహా 4 వికెట్లతో చెలరేగినా ఫలితం లేకపోయింది.
సూపర్ కోహ్లి...
గత ఏడాది ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన కోహ్లి ఈ సీజన్‌లో తాను బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాడు. సౌతీ వేసిన మూడో ఓవర్లో భారీ సిక్సర్‌తో పాటు రెండు వరుస బౌండరీలు బాది జోరును ప్రదర్శించాడు. మరో ఎండ్‌లో గేల్ (27 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్సర్) తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. గేల్‌ను హార్దిక్ అవుట్ చేయడంతో 63 పరుగుల (56 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ దశలో ‘పాండ్యా బ్రదర్స్’ హార్దిక్, కృనాల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 4 ఓవర్లపాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు. 14వ ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌లో డివిలియర్స్ (19) సిక్సర్ కొట్టగా... కోహ్లి రెండు వరుస బౌండరీలను బాది 39 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. అయితే ఐదు పరుగుల వ్యవధిలో కోహ్లి, డివిలియర్స్ (19; 1 సిక్స్) అవుటైన తర్వాత బెంగళూరు కోలుకోలేకపోయింది.
మెరుపు భాగస్వామ్యం...
సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ను బద్రీ వణికించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో బద్రీ ‘హ్యాట్రిక్’ సాధించడంతో ముంబై తీవ్ర ఇబ్బందుల్లో పడింది. బద్రీ ధాటికి వరుస బంతుల్లో పార్థివ్ (3), మెక్లీనగన్ (0), రోహిత్ (0) పెవిలియన్ చేరారు. ఆ తర్వాత నితీశ్ రాణా (11)ను కూడా అవుట్ చేసి బద్రీ తన ఖాతాలో నాలుగో వికెట్‌ను వేసుకున్నాడు. విజయంపై బెంగళూరు ఆశలు పెట్టుకున్న ఈ దశలో పొలార్డ్, కృనాల్ పాండ్యా భాగస్వామ్యం ముంబైకి మళ్లీ ఊపిరి పోసింది. వీరిద్దరు ఫోర్లు, సిక్సర్లతో దూకుడు ప్రదర్శించారు. పొలార్డ్ అవుటయ్యాక కృనాల్‌కు హార్దిక్ (9 నాటౌట్) అండగా నిలవడంతో ముంబై 7 బంతులు ఉండగానే గెలిచింది.
►16 ఐపీఎల్ చరిత్రలో నమోదైన మొత్తం ‘హ్యాట్రిక్’ల సంఖ్య. లక్ష్మీపతి బాలాజీ, మఖాయ ఎన్తిని, రోహిత్ శర్మ, ప్రవీణ్ కుమార్, అజిత్ చండిలా, సునీల్ నరైన్, ప్రవీణ్ తాంబే, షేన్ వాట్సన్, అక్షర్ పటేల్, సామ్యూల్ బద్రీ, ఆండ్రూ టై ఒక్కోసారి ‘హ్యాట్రిక్’ సాధించగా... యువరాజ్ సింగ్ రెండు సార్లు, అమిత్ మిశ్రా అత్యధికంగా మూడుసార్లు ‘హ్యాట్రిక్’ నమోదు చేశారు.