
ఆక్లాండ్: తనకంటే మెరుగైన ర్యాంకర్‌ను ఓడించి భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు హెచ్‌ఎస్ ప్రణయ్ న్యూజిలాండ్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్–300 టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్ ప్రణయ్ 21–14, 21–12తో ప్రపంచ 13వ ర్యాంకర్ టామీ సుగియార్తో (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్‌లో ప్రణయ్‌కు ఏదశలోనూ సుగియార్తో నుంచి పోటీ ఎదురుకాలేదు. రెండు గేముల్లోనూ ప్రణయ్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు.
మరోవైపు భారత మరో స్టార్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. చైనా దిగ్గజం, ఏడో సీడ్ లిన్ డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ 12–21, 12–21తో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) ద్వయం 17–21, 19–21తో గో వి షెమ్–తాన్ వి కియోంగ్ (మలేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది.