యోగేశ్వర్ ‘పట్టు’ అదిరింది
నోయిడా: నిర్ణయాత్మక బౌట్‌లో ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ తన ‘పట్టు’ పవర్‌ను చూపెట్టడంతో... ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్)లో హరియాణా హ్యామర్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా 4-3తో యూపీ వారియర్స్‌పై నెగ్గింది. రెండు జట్లు మూడేసి బౌట్‌లలో విజయం సాధించడంతో స్కోరు 3-3తో సమానమైంది. ఈ దశలో నిర్ణాయక బౌట్‌లో హరియాణా ఐకాన్ ప్లేయర్ యోగేశ్వర్ దత్ పురుషుల 65 కేజీల బౌట్‌లో సంచలన ఆటతీరును చూపెట్టాడు. 9-4తో వికాస్ కుమార్ (యూపీ)ని ఓడించాడు.
అద్భుతమైన టెక్నిక్‌తో ఫైనల్ విజిల్ రాకముందే ప్రత్యర్థిని చిత్తు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు పురుషుల 74 కేజీల బౌట్‌లో లివెన్ లోపెజ్ అజుకి (హరియాణా), 57 కేజీల బౌట్‌లో నితిన్ (హరియాణా), 125 కేజీల బౌట్‌లో హితేందర్ (హరియాణా) విజయం సాధించారు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు యోధా స్‌తో పంజాబ్ రాయల్స్ జట్టు తలపడుతుంది.