బజరంగ్‌ కోసం బై...బై  | Yogeshwar Dutt happy to have retired for the sake of Bajrang Punia | Sakshi
Sakshi News home page

బజరంగ్‌ కోసం బై...బై 

Published Sat, Nov 3 2018 1:47 AM | Last Updated on Sat, Nov 3 2018 1:47 AM

Yogeshwar Dutt happy to have retired for the sake of Bajrang Punia - Sakshi

అంతర్జాతీయస్థాయిలో భారత రెజ్లింగ్‌ ముఖచిత్రాన్ని మార్చిన రెజ్లర్లు సుశీల్‌ కుమార్, యోగేశ్వర్‌ దత్‌. ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ గేమ్స్, ఒలింపిక్స్‌లాంటి మెగా ఈవెంట్స్‌లో పతకాలు గెలిచిన వీరిద్దరిలో సుశీల్‌ ఇంకా ‘కుస్తీ’ పడుతుండగా... యోగేశ్వర్‌ దత్‌ మాత్రం రెండేళ్లుగా ‘మ్యాట్‌’కు దూరంగా ఉన్నాడు. అయితే శుక్రవారం తన 35వ పుట్టిన రోజు సందర్భంగా రెజ్లింగ్‌ కెరీర్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు యోగేశ్వర్‌ దత్‌ తెలిపాడు.    

సోనెపట్‌ (హరియాణా): ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించడం కలగానే మిగిలి పోయినప్పటికీ... ఇక రెజ్లింగ్‌ మ్యాట్‌పై బరిలోకి దిగే ఆలోచన లేదని భారత స్టార్‌ రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌ తెలిపాడు. హరియాణాకు చెందిన 35 ఏళ్ల యోగేశ్వర్‌ 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం... 2014 కామన్వెల్త్‌ గేమ్స్‌... 2014 ఏషియన్‌ గేమ్స్‌లలో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా పోటీపడినా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన అతను ఆ తర్వాత మళ్లీ మ్యాట్‌పైకి అడుగు పెట్టలేదు. 2017లో వివాహం చేసుకొని, అదే ఏడాది తన సొంత రాష్ట్రం హరియాణాలో అకాడమీని నెలకొల్పిన యోగేశ్వర్‌ 10 నుంచి 17 ఏళ్లలోపు ఉన్న 80 మంది కుర్రాళ్లకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. అతని ప్రియమైన శిష్యుడు బజరంగ్‌ పూనియా ఇటీవలే ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో 65 కేజీల విభాగంలో రజత పతకం గెలిచాడు. అంతేకాకుండా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. శుక్రవారం తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన యోగేశ్వర్‌ అధికారికంగా రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై యోగేశ్వర్‌ అభిప్రాయాలు అతని మాటల్లోనే... 

సరైన నిర్ణయమే... 
నేను 2020 టోక్యో ఒలింపిక్స్‌ లో పాల్గొనే అవకాశం లేదు కాబట్టి బజరంగ్‌కు అవసరమైన ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ స్వర్ణ పతకం సాధించలేదు. ఇప్పటి నుంచే బజరంగ్‌కు సరైన దిశానిర్దేశం చేస్తే టోక్యో ఒలింపిక్స్‌లో అతను తప్పకుండా పసిడి పతకం గెలుస్తాడన్న నమ్మకం ఉంది. వ్యక్తిగతంగా నా కెరీర్‌ అద్భుతంగా సాగింది. వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో పాల్గొన్నాను.  

ఆ పతకం లేకపోయినా... 
దాదాపు అన్ని మెగా ఈవెంట్స్‌లో నేను పతకం సాధించినా ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకం మాత్రం మిగిలిపోయింది. ఈ ఏడాది బుడాపెస్ట్‌లో పోటీపడాలని భావించాను. అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బజరంగ్‌ బరిలోకి దిగితేనే బాగుంటుందని నా ఆలోచనను విరమించుకున్నాను. చిన్నప్పటి నుంచి బజరంగ్‌ను చూస్తున్నాను. ఈస్థాయికి రావడానికి అతను ఎన్నో త్యాగాలు చేశాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతని ప్రదర్శన ఆకట్టుకుంది. అయితే అతని ఆటలో కొన్ని బలహీనతలు ఉన్నా యి. అయితే ప్రాక్టీస్‌ ద్వారా వాటిని అధిగమిస్తాడన్న నమ్మకం ఉంది. అకాడమీ నిర్వహణలో ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం లేకున్నా జేఎస్‌డబ్ల్యూ 15 మంది రెజ్లర్లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. బజరంగ్‌ను ఒలింపిక్‌ చాంపియన్‌గా చూడాలన్నదే నా స్వప్నం. అంతే కాకుండా నా అకాడమీ నుంచి ప్రపంచ చాంపియన్లను తయారు చేయాలన్నదే నా సుదీర్ఘ లక్ష్యం.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement