
టెస్టుల్లో పుజారానే బెస్ట్
శ్రీలంకతో టెస్టులో మూడు రోజులు ఆధిపత్యం వహించి.. నాలుగో రోజు ఒక్క సెషన్‌లో చెత్త బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను అప్పగించేసింది భారత జట్టు. నాలుగో రోజు 9 వికెట్లు చేతిలో ఉంచుకొని 153 పరుగులు చేయలేకపోయింది. 176 పరుగుల లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి 112 పరుగులకే ఆలౌటై 63 పరుగులతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి..
పుజారాకే చాన్స్ ఇవ్వాల్సింది
టీమిండియా ఈ టెస్టులో నెగ్గితే పరిస్థితి వేరేలా ఉండేదేమో కానీ.. అనూహ్య ఫలితం రావడంతో అందరి దృష్టి ఎక్కువగా నిలిచింది వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మపైనే. సీనియర్లు, క్రీడా పండితుల మాటలు కూడా వినకుండా టెస్టు స్పెషలిస్ట్ పుజారాను పక్కన పెట్టి మరీ రోహిత్‌ను జట్టులోకి తీసుకున్నారు. రోహిత్ మాత్రం మ్యాచ్‌లో ఘోరమైన ప్రదర్శన చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 13 పరుగులే చేశాడు. కీలకమైన మూడోస్థానంలో వచ్చి కనీసం టెయిలెండర్ల స్థాయి ఆటతీరు కూడా కనబర్చలేదు. జట్టులో కచ్చితంగా ఐదుగురు బౌలర్లను తీసుకుంటే, బ్యాటింగ్ విభాగంలో పుజారాకు బదులు రోహిత్‌ను తప్పిస్తేనే బెటర్. ఒకవేళ నలుగురు బౌలర్లతో ఆడితే ఎలాగూ వీరిద్దరికి అవకాశం వస్తుంది.
ఆరుగురు సరిపోతారా..
కోహ్లి ఎంచుకున్న ఐదుగురు బౌలర్ల వ్యూహాం ఈ మ్యాచ్‌లో పనిచేసింది. అయితే కొంపముంచింది కూడా అదే వ్యూహాం. ఒక స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ తక్కువ కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. పైగా తుదిజట్టులోకి తీసుకున్న బౌలర్లలో హర్భజన్ సింగ్ విఫలమయ్యాడు. తోటి స్పిన్నర్లు ఇరగదీసిన చోట రెండు ఇన్నింగ్స్‌ల్లో కలసి కేవలం ఒకే వికెట్ తీశాడు. పైగా బంగ్లా టూర్, జింబాబ్వే పర్యటనలో కూడా భజ్జీ గొప్పగా రాణించింది లేదు. ఎలాగూ ఆఫ్‌స్పిన్నర్ అశ్విన్ ఉన్నాడు కాబట్టి భజ్జీ స్థానంలో మరో బౌలర్‌కు అవకాశమిస్తే బాగుంటుంది. లేదా నలుగురు బౌలర్లతో ఆడితే ఒక బ్యాట్స్‌మెన్‌కు అవకాశం లభిస్తుంది. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్లు సైతం నలుగురు బౌలర్లతోనే ఆడతాయి. కోహ్లి ఈ విషయంపై మరోసారి ఆలోచిస్తే మంచిదేమో.
16వ ఆటగాడిగా బిన్నీ
శ్రీలంకలో పర్యటిస్తున్న భారత టెస్టు జట్టుతో ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ చేరనున్నాడు. అతణ్ని జట్టులో 16వ సభ్యుడిగా ఎంపిక చేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. జట్టులో సమతుల్యం కోసం ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శ్రీలంకతో రెండో టెస్టు కొలంబోలో ఈనెల 20న మొదలవుతుంది.
డీఆర్‌ఎస్‌పై మళ్లీ మొదటికి..
మ్యాచ్‌లో హీరో నిస్సందేహంగా చండీమలే. అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లో కనీసం పోటీ ఇచ్చే స్థితిలో కూడా లేని జట్టుని నెగ్గే వరకు తీసుకొచ్చాడు. భారత బౌలర్లను ఆటాడుకొని 169 బంతుల్లోనే 162 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే చండీమల్ 5 పరుగుల వద్దే అవుటయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో బంతి అతని ప్యాడ్, బ్యాట్‌ను తగిలి ఫీల్డర్ రాహుల్ చేతిలో పడింది. బంతి ప్యాడ్‌ను మాత్రమే తగిలిందని భావించిన అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఒకవేళ డీఆర్‌ఎస్ ఉంటే భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించినా ఆశ్చర్యంగా లేకపోయేది. మ్యాచ్ అనంతరం కోహ్లి సైతం ఈ విషయంపై నోరు విప్పాడు. సిరీస్ అయిపోయాక డీఆర్‌ఎస్ గురించి ఆలోచిస్తామని తెలిపాడు. నిజానికి డీఆర్‌ఎస్‌ను అన్ని దేశాలు వాడుతున్నా బీసీసీఐ మొండివైఖరి వల్ల భారత్ మాత్రమే దాన్ని సమర్ధించడం లేదు. ఇప్పటికైనా డీఆర్‌ఎస్‌పై పునరాలోచించాలి.