చెలరేగిన పుజారా, రోహిత్ శర్మ
రుస్తెన్‌బర్గ్: చతేశ్వర్ పుజారా (205 బంతుల్లో 140; 17 ఫోర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరుగుతున్న అనధికారిక తొలి టెస్టులో భారత్ ‘ఎ’ నిలకడగా ఆడుతోంది. టాప్ ఆర్డర్ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంతో శనివారం తొలి రోజు ఆట ముగిసే సరికి తమ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 90 ఓవర్లలో మూడు వికెట్లకు 281 పరుగులు చేసింది. సీనియర్ టెస్టు జట్టులో చోటు కోసం పరితపిస్తున్న రోహిత్ శర్మ (159 బంతుల్లో 70 బ్యాటింగ్; 8 ఫోర్లు; 1 సిక్స్) భారీ స్కోరు దిశగా వెళుతున్నాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్‌తో పాటు రహానే (11) ఉన్నాడు. పార్నెల్, బిర్చ్, హార్మర్‌లకు తలా ఓ వికెట్ లభించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ తొలి వికెట్‌ను త్వరగానే కొల్పోయింది. శిఖర్ ధావన్ (46 బంతుల్లో 11; 1 సిక్స్) విఫలమై తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు. అనంతరం మురళీ విజయ్ (115 బంతుల్లో 44; 6 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశాడు. రెండో వికెట్‌కు వీరి మధ్య 66 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత రోహిత్ జత కలవడంతో స్కోరు బోర్డు వేగంగా పెరిగింది. 73వ ఓవర్లో పుజారా శతకాన్ని చేరగా, అదే ఓవర్‌లో రోహిత్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కొద్ది సేపటికి పార్నెల్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేయడంతో పుజారా బౌల్డ్ అయ్యాడు. మూడో వికెట్‌కు 176 పరుగుల భారీ భాగస్వామ్యం లభించింది.