ఆసీస్ కు అడ్డుగోడగా పుజారా
రాంచీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ దీటుగా బదులిస్తోంది. ఓవర్ నైట్ స్కోరు 120/1 తో శనివారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మూడో రోజు ఆట నిలిపివేసే సమయానికి 130 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. 10 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఉదయం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆటగాడు చటేశ్వర పుజారా ఆసీస్ కు పరీక్ష పెట్టాడు. 218 బంతుల్లో 14 ఫోర్లతో సెంచరీ మార్కును చేరిన పూజారా.. ఆసీస్ బౌలర్లను సమర్దంగా ఎదుర్కొన్నాడు. ఓ వైపు సహచరులు వెనుదిరుగుతున్నా అజేయ సెంచరీతో పుజారా(328 బంతుల్లో 130 నాటౌట్: 17 ఫోర్లు) భారత్ కు ఆశాకిరణంగా మారాడు. స్టార్క్ స్థానంలో జట్టులోకొచ్చిన బౌలర్ కమిన్స్ 4/59 చెలరేగుతున్నా.. విజయ్ హాఫ్ సెంచరీ(183 బంతుల్లో 82: 10 ఫోర్లు)తో కలిసి రెండో వికెట్ కు సెంచరీ (102) భాగస్వామ్యం అందించాడు.
కోహ్లీ వైఫల్యాల పరంపర!
బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో కెప్టెన్ కోహ్లీని వైఫల్యాలు వెంటాడుతున్నాయి. కోహ్లీ రాంచీ టెస్టులోనూ నిరాశపరిచాడు. గాయంతో బాధపడుతున్న కోహ్లీ కోలుకుని బ్యాటింగ్ కు దిగినా కేవలం 6 పరుగులే చేసి కమిన్స్ బౌలింగ్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు క్యాచిచ్చి ఔటయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రహానే(14)ను కమిన్స్ పెవిలియన్ బాట పట్టించాడు. రహానేతో కలిసి పుజారా నాలుగో వికెట్ కు 51 పరుగులు జతచేశాడు. కాగా, కరుణ్ నాయర్(23) కుదురుకున్నట్లు కనిపించినా వేగంగా ఆడే క్రమంలో హజెల్ వుడ్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. ఆల్ రౌండర్ అశ్విన్ (3) నిరాశపరిచాడు. శనివారం ఆట నిలిపివేసే సమయానికి సెంచరీ హీరో పుజారా(130 నాటౌట్) కు తోడుగా వృద్ధిమాన్ సాహా(18 నాటౌట్) ఆటను కొనసాగిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఇంకా 91 పరుగులు వెనకబడి ఉంది.