చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్(పీకేల్)లో పుణెరి పల్టాన్ మరో అద్భుత విజయాన్ని సాధించింది. శనివారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్ లో పుణెరి పల్టాన్ 34-33 తేడాతో యూపీ యోధాపై గెలిచి సత్తాచాటుకుంది. రెండో అర్ధభాగంలో దాదాపు పది పాయింట్లు వెనుకబడిపోయిన దశలో పుంజుకున్న పుణెరి చివరకు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పుణెరి జట్టులో దీపక్ హుడా మూడు సూపర్ రైడ్ లతో కలుపుకుని మొత్తం 16 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరొకవైపు యూపీ యోధా ప్లేయర్ సాగర్ కృష్ణ ఆరు టాకిల్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు. చివర్లో యూపీ యోధా తిరిగి తేరుకున్నప్పటికీ పాయింట్ తేడాతో మ్యాచ్ ను కోల్పోవాల్సి వచ్చింది.
హోరాహోరీ
ఈ మ్యాచ్ లో పుణెరికి మంచి ఆరంభం లభించింది. హుడా సూపర్ రైడ్ చేయడంతో ఆ జట్టు 5-2 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. అయితే ఏడో నిమిషంలో రిష్నక్ దేవడిగ ఒక సూపర్ రైడ్ చేయడంతో యూపీ యోధా స్కోరును 5-5 తో సమం చేసింది. కాగా, ఎనిమిదో నిమిషంలో దీపక్ హుడా మరొక సూపర్ రైడ్ సాధించి పుణెరి స్కోరు 9-5కు తీసుకుపోయాడు. అయితే పదో నిమిషంలో యోధా సూపర్ టాకిల్ చేయడంతో పుణెరి ఆధిక్యాని తగ్గించింది.
ఆట15 నిమిషంలో ఇరు జట్లు స్కోరు సమం కాగా, 18 నిమిషంలో మరొకసారి పుణెరి 15-12తో ఆధిక్యంలో నిలిచింది. ఆపై మరుసటి నిమిషంలోనే యోధా ఆలౌట్ కావటంతో పుణె 18-14తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. ఇక సెకండ్ హాఫ్ లో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు సాగింది. ఒక్కసారిగా పుంజుకున్న యూపీ యోధా వరుస పాయింట్లతో దూసుకుపోయింది. ఈ క్రమంలోనే భారీ వ్యత్యాసాన్ని పుణె ముందు ఉంచింది. కాగా, పాయింట్లను కాపాడుకోవాలనే భావనతో పూర్తి ఆత్మరక్షణలో పడిపోయిన యోధా అనవసర తప్పిదాలు చేస్తూ పాయింట్లను కోల్పోయింది. దాంతో ఆట చివరి నిమిషంలో ఆధిక్యంలోకి వచ్చిన పుణెరి దాన్ని కాపాడుకుని పాయింట్ తేడాతో విజయకేతనం ఎగురవేసింది.