ముంబై: కింగ్స్ లెవెన్ పంజాబ్ ఐపీఎల్ ఏడో అంచె ఫైనల్కు దూసుకెళ్తోంది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో పంజాబ్ 24 పరుగులతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. పంజాబ్ ఫైనల్లో కోల్కతాతో తలపడనుంది. 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై పూర్తి ఓవర్లలో ఏడు వికెట్లకు 202 పరుగులే చేయగలిగింది. చెన్నై ఓపెనర్లు డుప్లెసిస్, డ్వెన్ స్మిత్ నిరాశ పరిచినా సురేష్ రైనా (25 బంతుల్లో 87) మెరుపు ఇన్నింగ్స్తో విజయం దిశగా నడిపించాడు. దీంతో ఆరు ఓవర్లలో స్కోరు 100 పరుగులకు చేరుకుంది. అయితే ఈ దశలో రైనా రనౌటవడంతో పరిస్థితి మారింది. ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు పడటంతో మ్యాచ్ పంజాబ్ వైపు మొగ్గింది. జడేజా (27)తో పాటు ధోనీ (42 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది.
అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నయ్కు పంజాబ్ బ్యాట్స్మెన్ చుక్కలు చూపించారు. ముఖ్యంగా వీరేంద్ర సెహ్వాగ్ చాలా రోజుల తర్వాత పరుగుల సునామీ సృష్టించాడు. విధ్వంసక బ్యాటింగ్తో రెచ్చిపోయి తనలో మునుపటి వాడి తగ్గలేదని నిరూపించుకున్నాడు. సెహ్వాగ్ మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. వీరూ 58 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 122 పరుగులు చేశాడు. దీంతో కింగ్స్ లెవెన్ పంజాబ్ నిర్ణీత ఓవర్లో ఆరు వికెట్లకు 226 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.
ఓపెనర్లు వీరూ, మనన్ వోహ్రా 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు శుభారంభం అందించారు. వోహ్రా (34) కాస్త సంయమనంతో ఆడినా వీరూ మెరుపు విన్యాసాలతో రెచ్చిపోయాడు. 21 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన వీరూ మరో 29 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. వోహ్రా అవుటయ్యాక.. మ్యాక్స్వెల్ కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. కాగా వీరూ అదే జోరు కొనసాగించగా, డేవిడ్ మిల్లర్ (38) అండగా నిలిచాడు. ఎట్టకేలకు నెహ్రా బౌలింగ్లో వీరూ అవుటయినా పంజాబ్ స్కోరు అప్పటికే 200 దాటిపోయింది.
ఐపీఎల్-7 ఫైనల్లో పంజాబ్
Published Fri, May 30 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM
Advertisement
Advertisement