సింధుకు మరో సవాల్‌ | PV Sindhu Attends French Badminton Tourney | Sakshi
Sakshi News home page

సింధుకు మరో సవాల్‌

Published Tue, Oct 22 2019 3:42 AM | Last Updated on Tue, Oct 22 2019 5:19 AM

PV Sindhu Attends French Badminton Tourney - Sakshi

పారిస్‌: ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచాక ఆడిన మూడు టోర్నమెంట్‌లలోనూ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ దాటలేకపోయిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు మరో పరీక్షకు సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో ఐదో సీడ్‌ సింధు టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. నేడు జరిగే మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, చైనా సంతతికి చెందిన కెనడా క్రీడాకారిణి మిచెల్లి లీతో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 5–2తో ఆధిక్యంలో ఉంది. గతవారం డెన్మార్క్‌ ఓపెన్‌లో 17 ఏళ్ల కొరియా అమ్మాయి యాన్‌ సె యంగ్‌ చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన సింధుకు ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది.

‘డ్రా’ ప్రకారం  సింధుకు క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)... సెమీఫైనల్లో రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) లేదా ప్రపంచ మాజీ చాంపియన్స్‌ ఒకుహారా (జపాన్‌) లేదా రచనోక్‌ (థాయ్‌లాండ్‌) ఎదురయ్యే అవకాశం ఉంది. భారత్‌కే చెందిన మరో స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహా్వల్‌ బుధవారం జరిగే తొలి రౌండ్‌లో చెయుంగ్‌ ఎన్గాన్‌ యి (హాంకాంగ్‌)తో ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్‌ తరఫున శ్రీకాంత్, కశ్యప్, సమీర్‌ వర్మ, శుభాంకర్‌ డే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మంగళవారం జరిగే తొలి రౌండ్‌లో సుగియార్తో (ఇండోనేసియా) తో శుభాంకర్‌ తలపడతాడు. బుధవారం జరిగే ఇతర మ్యాచ్‌ల్లో రెండో సీడ్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)తో శ్రీకాంత్‌; ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌)తో కశ్యప్‌; కెంటా నిషిమోటో (జపాన్‌)తో సమీర్‌ వర్మ ఆడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement