సెమీస్‌లో సింధు, శ్రీకాంత్
సయ్యద్ మోడి బ్యాడ్మింటన్ టోర్నీ
లక్నో: అంచనాలను నిలబెట్టుకుంటూ భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మరో తెలుగు ఆటగాడు భమిడిపాడి సాయిప్రణీత్ కూడా సెమీస్‌కు చేరుకున్నాడు. పురుషుల విభాగంలో నలుగురు భారత ఆటగాళ్లే సెమీస్‌లో తలపడనుండటం విశేషం. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మూడో సీడ్ శ్రీకాంత్ 21–12, 21–17 స్కోరుతో ఏడో సీడ్ జుల్ఫాద్‌లీ జుల్కిఫ్‌లీ (మలేసియా)ను చిత్తు చేశాడు. మరో క్వార్టర్స్‌లో తొమ్మిదో సీడ్ సాయిప్రణీత్ 21–19, 12–21, 21–10తో భారత ఆటగాడు సౌరభ వర్మపై గెలుపొందాడు.
సెమీస్‌లో శ్రీకాంత్‌తో సాయిప్రణీత్ తలపడతాడు. మరో ఇద్దరు భారత షట్లర్లు క్వార్టర్స్‌లో సంచలన విజయాలు సాధించారు. ఎనిమిదో సీడ్, జాతీయ చాంపియన్ సమీర్ వర్మ 21–15, 21–13తో రెండో సీడ్ క్రిస్టియాన్ విటింగస్ (డెన్మార్క్)ను చిత్తుగా ఓడించాడు. మరో మ్యాచ్‌లో ముంబై ఆటగాడు, అండర్–19 మాజీ జాతీయ చాంపియన్ హర్షీల్ దానీ కూడా 21–16, 17–21, 21–11తో పన్నెండో సీడ్ ఎమిల్ హోస్ట్ (డెన్మార్క్)ను ఓడించి సమీర్‌తో పోరుకు సిద్ధమయ్యాడు.
మహిళల విభాగంలో టాప్ సీడ్ పీవీ సింధు 21–15, 21–11తో భారత్‌కే చెందిన క్వాలిఫయర్ వైదేహీ చౌదరిపై ఘన విజయం సాధించింది. రితూపర్ణదాస్ (భారత్)ను 21–17, 13–21, 23–21తో చిత్తు చేసిన నాలుగో సీడ్ ఫిత్రియాని (ఇండోనేసియా)ను సింధు సెమీస్‌లో ఎదుర్కొంటుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో బీట్రిజ్ కొరాల్స్ (స్పెయిన్ )ను 21–9, 21–11తో ఓడించి గ్రెగొరియా మరిస్కా (ఇండోనేసియా)... శ్రీకృష్ణ ప్రియ (భారత్)ను 21–17, 21–15తో ఓడించి హనా రమదీని (ఇండోనేసియా) కూడా సెమీస్‌లోకి అడుగు పెట్టారు.
సెమీఫైనల్లో సిక్కి రెడ్డి
హైదరాబాద్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో సెమీస్‌కు చేరుకుంది. మహిళల డబుల్స్‌లో సిక్కి–అశ్విని పొన్నప్ప జోడి 21–14, 21–18తో మలేసియా జంట మీ కువాన్ చౌ–లీ మెంగ్ యీన్ ను ఓడించింది. మిక్స్‌డ్ క్వార్టర్స్‌లో సిక్కి–ప్రణవ్ చోప్రా 21–16, 21–19తో యోగేంద్ర కృష్ణన్ –ప్రజక్తా సావంత్‌ను ఓడించగా, మరో క్వార్టర్స్‌లో యోంగ్ కై టెరీ–వీ హాన్ టాన్ పై సుమీత్ రెడ్డి–అశ్విని 21–18, 23–21తో నెగ్గారు.